ఛత్తీస్‌గఢ్ బీజాపుర్ జిల్లా అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా.. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
నక్సల్ ఏరివేతలో భాగంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై తారెం ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులు జరిపారని.. దీంతో భద్రతా దళాలు దాడి చేశాయని ఛత్తీస్‌గఢ్ డీజీపీ అవస్థీ తెలిపారు.
9 నక్సల్స్ హతం!
ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొమ్మిది మంది నక్సల్స్ మరణించి ఉంటారని బస్తర్ ఐజీ పీ సుందర్ రాజ్ వెల్లడించారు. మరో 15 మంది గాయపడ్డారని వెల్లడించారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు మరింత సమయం కావాలని చెప్పారు. తమ అంచనా ప్రకారం ఘటన జరిగిన ప్రాంతంలో 250 మంది నక్సల్స్ ఉన్నారని తెలిపారు.
రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు
సీఆర్‌పీఎఫ్(కోబ్రా) దళంతో పాటు, జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అధికారులు వివరించారు. పారామిలిటరీ దళాలకు సహాయంగా ఎంఐ-17 హెలికాప్టర్లను రంగంలోకి దించారు.