ఉత్తరాఖండ్ దేహ్రాదూన్‌లోని జాలీగ్రాంట్ విమానాశ్రయంలో(Jolly Grant Airport) ఓ ఏనుగు(Elephant) బీభత్సం సృష్టించింది. ప్రహరీ గోడను కూలగొట్టి, విమానాశ్రయం ప్రాంగణంలోకి ప్రవేశించి.. రన్‌వేపై పరుగులు తీసింది. ఈ గజరాజు గురించి.. అటవీ శాఖకు విమానాశ్రయ అధికారులు సమాచారం అందించారు. దాంతో అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది.. రెండు గంటలపాటు శ్రమించి, ఆ ఏనుగును విమానాశ్రయ ప్రాంగణం నుంచి బయటకు పంపించారు.
ఇళ్లు ధ్వంసం..
అటవీ శాఖ అధికారులు(Forest Department) రాకముందు.. ఏనుగును తరిమేసేందుకు విమానాశ్రయ అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. టపాసులు కాల్చారు. దీంతో విమానాశ్రయాన్ని(Jolly Grant Airport) వీడి వెళ్లిన ఏనుగు.. సమీపంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ కొన్ని ఇళ్లను ధ్వంసం చేసింది. అయితే.. అనంతరం మళ్లీ విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చింది. అప్పుడు అటవీ శాఖ సిబ్బంది వచ్చి.. దాన్ని విజయవంతంగా బయటకు పంపించారు.
"రాత్రి రెండు గంటల సమయంలో విమానాశ్రయంలోకి ఏనుగు ప్రవేశించింది. దాన్ని బయటకు పంపించడానికి అటవీ సిబ్బంది ఎంతగానో శ్రమించారు. మొదట విమానాశ్రయాన్ని వీడిన తర్వాత.. అది పక్కనున్న ఓ గ్రామానికి వెళ్లి, విధ్వంసం సృష్టించింది. విమానాశ్రయ ప్రహరీ గోడతోపాటు సమీప గ్రామంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనంతరం.. ఆ ఏనుగు అడవిలోకి వెళ్లింది."
-ఎన్ఎల్ దోవల్, దెహ్రాదూన్ పోలీస్ స్టేషన్ రేంజ్ అధికారి
ఇదీ చూడండి: హైవేపై ఏనుగు- రెండు గంటలపాటు ట్రాఫిక్ జాం