దేశంలో ఎన్నికల రారాజుగా పేరుగాంచిన పద్మరాజన్ వచ్చే ఎన్నికల్లో కేరళలోని ధర్మాదం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఏకంగా.. ముఖ్యమంత్రి, సీపీఎం నేత పినరయి విజయన్‌పైనే బరిలోకి దిగుతున్నారు.
ఇప్పటివరకు రెండు వందలసార్లకుపైగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్కదాంట్లోనూ గెలవకపోవడం గమనార్హం.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం..
దేశంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు ఓడిపోయిన అభ్యర్థిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు పద్మరాజన్. ఇప్పటివరకు సుమారు 216 సార్లు ఎన్నికల్లో నామపత్రాలు దాఖలు చేసిన ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు ఎన్నికల కోసం ఆయన రూ. 50 లక్షలు వెచ్చించడం విశేషం.
బరిలో ఎవరున్నారు అనేది అనవసరం..
ఎన్నిక ఏదైనా, బరిలో ఎవరున్నా.. తనకు అనవసరమని అంటారు ఎలక్షన్ కింగ్. ప్రత్యర్థి ప్రధాని అయినా, రాహుల్ గాంధీ అయినా లెక్కచేయరు. ఇలానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీపై వడోదర నుంచి పోటీ చేశారు. కేరళలో రాహుల్‌కూ సవాల్ విసిరారు. రెండింట్లోనూ ఓడారు.
దానికోసమే పోటీ చేస్తున్నా..
ఎన్నికలు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాదని అంటారు పద్మరాజన్. ప్రతి సామాన్యుడూ పోటీ చేయగలడని రుజువు చేయడమే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ఆలోచనతోనే తొలుత 1988లో తమిళనాడు సేలంలోని మెట్టూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశానని చెప్పుకొచ్చారు.
ప్రచారం చేస్తారా..?
ఎన్నికల్లో పోటీ చేయడం, నామపత్రాలు దాఖలు చేయడం మాత్రమే తన వంతు అంటారు పద్మరాజన్. రాబోయే ఎన్నికల్లో ధర్మాదం నుంచి పోటీ చేస్తున్న ఆయన్ను ప్రచారం చేస్తారా అని అడిగితే.. అందుకు తనకు సమయం లేదని అన్నారు. తమిళనాడులోని మరో నాలుగు సీట్లకు నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు.