లోక్ జనశక్తి పార్టీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నేతలు చిరాగ్ పాస్వాన్, పశుపతి కుమార్‌కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తును కొంతకాలం పాటు ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 30న జరగనున్న ఉపఎన్నికల్లో ఇరు వర్గాల నేతలు స్వతంత్ర గుర్తులపై పోటీ చేయాలని సూచించింది.
'పార్టీలోని ఇరువర్గాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు ఎల్జేపీ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నాం. రెండు గ్రూపులు పోటీ చేయవచ్చు. వారు కోరుకుంటే లోక్ జనశక్తి పార్టీతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది' అని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
బిహార్ ఎన్నికలకు ముందు.. ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాసవాన్ చనిపోగానే.. ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే అత్యంత నాటకీయంగా చిరాగ్‌ను లోక్ జనశక్తి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు అసమ్మతి నేతలు. పార్టీ కార్యనిర్వాహక ఆధ్యక్షుడిగా సూరజ్భాన్ సింగ్‌ను నియమించారు. అదే సమయంలో... లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) లోక్‌సభాపక్ష నేతగా కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ ఆ పార్టీలోని ఐదుగురు ఎంపీలు ఎన్నుకున్నారు. ఇలా ఇరువురి మధ్యన పార్టీపై పట్టుకోసం వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల గుర్తు ఫ్రీజ్ చేయాలని ఈసీ నిర్ణయించింది.