నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను.. ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. బంగాల్లో 8, అసోంలో 3, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒక్కో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రాల వారీగా పోలింగ్ వివరాలు, రాజకీయ సమీకరణలు పరిశీలిద్దాం.
బంగాల్
- స్థానాలు:- 294
- పోలింగ్ తేదీలు:- 27 మార్చి, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29(మొత్తం 8 దశలు)
- ఫలితాలు:- మే 2
- ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బంగాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. అయితే సీఎం మమతా బెనర్జీకి భాజపా గట్టి పోటీనిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న కమల దళం.. అనంతరం టీఎంసీకి ప్రతి విషయంలోనూ సవాలు విసురుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే.. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వేడి తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం గడతారన్న అంశం ఉత్కంఠకు దారి తీస్తోంది.
- బిహార్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న ఏఐఎమ్ఐఎమ్.. బంగాల్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఆశిస్తోంది. ఇందుకోసం అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం ఎన్నికల ఫలితాల్లో ఎంత మేర ఉంటుందన్నది కూడా ముఖ్యమే.
ఇవీ చూడండి:-
బంగాల్ దంగల్: ఆ 109 సీట్లపై భాజపా గురి!
దీదీ దూత X మోదీ పరా: యాప్‌లతో ఓట్ల వేట!
తమిళనాడు
- స్థానాలు:- 234
- పోలింగ్ తేదీ:- ఏప్రిల్ 6
- ఫలితాలు:- మే 2
- మాజీ సీఎంలు కరుణానిధి, జయలలిత మరణానంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. రాష్ట్రంలో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. ఇక్కడ భాజపా.. అన్నాడీఎంకేకు మద్దతిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నుంచి అన్నాడీఎంకేకు భారీగా పోటీ ఎదురవుతోంది. జయలలిత నెచ్చెలి శశికళ జైలు నించి తిరిగి రావడం.. ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చింది.
- కమల్ హాసన్ పార్టీ 'ఎమ్ఎన్ఎమ్'.. ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న ఆయన.. వ్యవస్థలో మార్పు అవసరం అంటూ ప్రచారాలు సాగిస్తున్నారు.
- సూపర్‌స్టార్ రాజనీకాంత్ కూడా ఈ ఎన్నికల్లో పోటీపడాల్సి ఉంది. పార్టీని కూడా ప్రకటిస్తానన్న ఆయన.. ఆరోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు.
ఇవీ చూడండి:-
తమిళనాట 'రాజకీయ శూన్యత' నిజమా? భ్రమా?
తమిళులపై 'ఎమ్జీఆర్' అస్త్రం ప్రభావమెంత?
కేరళ
- స్థానాలు:- 140
- పోలింగ్ తేదీ:- ఏప్రిల్ 6
- ఫలితాలు:- మే 2
- రాష్ట్రంలో ప్రస్తుతం వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. ఈసారి ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భావిస్తోంది.
- భాజపా కూడా కేరళ ఓటర్లను ఆకర్షించేందుకు తన వంతు కృషి చేస్తోంది. మెట్రోమ్యాన్ శ్రీధరన్ చేరికతో పార్టీ మరింత బలపడుతుందని ఆశిస్తోంది.
- శబరిమలపై సుప్రీం తీర్పు, గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ వంటి అంశాలు కీలకంగా మారాయి.
ఇవీ చూడండి:-
కాంగ్రెస్ 'శబరిమల వ్యూహం' ఫలిస్తుందా?
కేరళ ఓట్ల వేట- 'మూడుసార్లు పోటీ'పై సీపీఐకి చిక్కులు!
కేరళలో 'బ్యాక్ డోర్' రాజకీయం- విజయన్‌కు కష్టమే!
అసోం
స్థానాలు:- 126
పోలింగ్ తేదీలు:- మార్చి 27, ఏప్రిల్ 2, ఏప్రిల్ 6(మొత్తం 3 దశలు)
ఫలితాలు:- మే 2
- 2016లో రాష్ట్రంలో తొలిసారిగా భాజపా జెండా ఎగిరింది. ఈసారీ అధికారం దక్కించుకోవాలని భాజపా ప్రణాళికలు రచించింది. భాజపాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం పార్టీ అగ్రనేతలు ఇప్పటికే అనేకమార్లు రాష్ట్రంలో పర్యటించారు.
- ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కీలకమైన తరుణ్ గొగొయి మరణం.. ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. ఈ తరుణంలో రాష్ట్రంపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఎలాంటి అస్త్రాలను అమలు చేస్తుందన్నది కీలకంగా మారింది.
ఇవీ చూడండి:-
'నినాదం అమిత్ షాది- విజయం కాంగ్రెస్‌ది!'
పుదుచ్చేరి
- స్థానాలు:- 33
- పోలింగ్ తేదీ:- ఏప్రిల్ 6
- ఫలితాలు:- మే 2
- ఎన్నికలకు ముందు ఇక్కడ నెలకొన్న అనూహ్య పరిణామాలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. ఈ నెలలో.. నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది. బలపరీక్షలో ఓడి.. తన పదవికి రాజీనామా చేశారు. భాజపా కుట్రతోనే తమ ప్రభుత్వం కూలిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము చేసిన మంచిని ప్రజలు గుర్తించి.. మరోసారి అధికారాన్ని అప్పచెబుతారని భావిస్తోంది.
- ఇక్కడ భాజపా, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడి కాంగ్రెస్-డీఎంకే కూటమితో పోటీ పడుతోంది.
ఇవీ చూడండి:-