తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చికిత్స కోసం ఓ వృద్ధుడు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. భారీ వర్షాల ధాటికి.. కొండచరియలు విరిగిపడటం వల్ల అంబులెన్స్ వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో చేసేదేంలేక ఆమెను ఎలాగైనా బతికించుకోవాలనుకున్న ఆ భర్త.. సిద్లీబాయీని భుజానికెత్తుకుని ఆసుపత్రికి నడక ప్రారంభించాడు.
దురదృష్టవశాత్తు ఆమె ఆసుపత్రి చేరకుండానే మృతిచెందింది. అప్పటికే పరిస్థితి విషమించడం వల్ల సిద్లీబాయీ.. అతని భుజాలపైనే ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా చాంద్సేలీ ఘాట్లో ఈ విషాదకర ఘటన జరిగింది.
''కొండచరియలు విరిగిపడటం వల్ల.. అంబులెన్స్ వెళ్లలేకపోయింది. ఆమెను సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు.''
- మహేశ్ పాటిల్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం తమకు ఇదే సమస్య తలెత్తుతోందని.. వర్షాల కారణంగా కొండచరియలు పడి రహదారులు మూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ప్రాణాలు పోసే చేతులే.. ఉసురు తీసుకుంటున్న దైన్యం