హరియాణా అటవీ శాఖ మంత్రి కన్వర్పాల్ గుర్జర్ ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. చెట్లకు పింఛన్ ఇవ్వాలన్న ఆయన సలహా ఇప్పుడు చట్ట ప్రకారం అమలులోకి రానుంది.
రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చెట్లకు పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదంటూ ప్రశ్నించారు కన్వర్పాల్ గుర్జర్. అధిక వయసు ఉన్న చెట్లకు పింఛన్ ఇస్తే వాటిని సంరక్షించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వృక్షాల నిర్వహణ సైతం సక్రమంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడీ ఆలోచనను రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా అమలులోకి తీసుకొస్తున్నారు.
ఆదేశాలు జారీ
70 ఏళ్లపైబడిన చెట్లను గుర్తించాలని 'వన్ భవన్' నుంచి ఆదేశాలు జారీ అయినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చెట్ల జాబితా తయారు చేసే బాధ్యతను రేంజ్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. వేప, మామిడి, జామ, ఇండియన్ రోజ్‌వుడ్, తుమ్మ, రావి చెట్లకు పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. నీలగిరి, చైనాబెర్రీ చెట్లను ఈ పథకం నుంచి మినహాయించినట్లు వివరించారు.
ఒక్కో గ్రామానికి వెళ్లి చెట్ల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అడవుల్లోనూ చెట్లను గుర్తించినట్లు తెలిపారు. గుళ్లలో ఉన్న చాలా చెట్ల వయసు డెబ్బై ఏళ్లపైనే ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: కాసేపట్లో పోస్ట్‌మార్టమ్.. అంతలోనే కదలిక!