బక్రీద్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు నిరాడంబరంగా జరుపుకొంటున్నారు. త్యాగనిరతిని చాటిచెప్పే ఈద్-ఉల్-అదా(Eid-ul-Adha)ను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
బక్రీద్ సందర్భంగా దిల్లీలోని జామా మసీదు(Jama masjid bakrid celebrations) వద్ద ఉదయం నుంచి పలువురు ముస్లింలు ప్రార్థనలు చేశారు. అయితే, కరోనా ఆంక్షల కారణంగా బక్రీద్ రోజున సాధారణంగా కనిపించే సందడి కరవైంది. ముస్లింలు ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలని ఇక్కడి ఇమామ్ పిలుపునిచ్చారని, ఈ నేపథ్యంలో జనం తక్కువగా ఉన్నారని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.
కేరళ, కర్ణాటక, మంబయి సహా పలు చోట్ల ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. తిరువనంతపురంలో భౌతిక దూరం పాటించి ప్రార్థనలు చేశారు ముస్లింలు.
రాష్ట్రపతి శుభాకాంక్షలు
దేశంలోని ముస్లింలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ ప్రేమ, త్యాగం, శాంతి, ఐక్యతకు గుర్తని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలతో సంతోషంగా పండుగ జరుపుకొందామని ట్వీట్ చేశారు.
మోదీ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) సైతం ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సామరస్యం, సానుభూతి వాతావరణాన్ని ఈ పండుగ మరింత పెంచాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం బక్రీద్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
మిఠాయిలు పంచుకున్న సైన్యం
మరోవైపు, పుల్వామా దాడి తర్వాత తొలిసారి భారత్, పాక్ సైన్యం సరిహద్దులో మిఠాయిలు పంచుకున్నాయి. బాడ్మేడ్ జిల్లాలోని సరిహద్దు పాయింట్ల వద్ద స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నాయి. పాకిస్థాన్ రేజంర్లకు భారత్కు చెందిన సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) స్వీట్లు అందించింది.
ఇదీ చదవండి: 'రాష్ట్రాల అంశాల్లో కేంద్ర ఏకపక్ష చట్టాలు చెల్లవు'