ప్రవాస భారతీయురాలైన వందనా వర్మ.. అంగారక గ్రహంపైకి నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్‌కు నిర్దేశకురాలు. కుజగ్రహంపై రోవర్ విజయవంతంగా దిగిన సందర్భంగా..వందనా వర్మతో ఈనాడు ముచ్చటించింది.
ఏళ్ల తరబడి శ్రమించి, భారీ వ్యయంతో నాసా నిర్మించిన పర్సెవరెన్స్ రోవర్ కదలికలను నియంత్రించే అతికొద్ది మందిలో మీరొకరు. ఈ భావన మీకెలా అనిపిస్తోంది?
జవాబు: చాలా ఉత్సాహంగా, ఉద్వేగంగా ఉంది. ప్రస్తుతం పర్సెవరెన్స్, ఇన్‌జెన్యుటీ బృందాల్లో మాత్రమే కాదు.. నాసాలోని ప్రతి ఒక్కరిలో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. ఇలాంటి సాహసోపేత మిషన్‌లను సాగించడానికి బృంద సహచరులపై పూర్తి విశ్వాసం ఉంచాలి. మేం అదే చేశాం. ఇన్నేళ్ల శ్రమ తర్వాత మా బృందంతో కలిసి.. పర్సెవరెన్స్ ల్యాండింగ్‌ను వీక్షించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ల్యాండింగ్‌కు ముందు.. జెజెరో బిలానికి సంబంధించి అంగారకుడి కక్ష్య నుంచి ఉపగ్రహాలు అందించిన చిత్రాలను నేను ఎప్పటికప్పుడు విశ్లేషించా. ల్యాండింగ్ సమయంలో తలెత్తే అవకాశమున్న వేలాది అంశాలపై అనుక్షణం మదింపు చేశా.
సంక్లిష్టమైన ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. తదుపరి మీ కార్యాచరణ ఏంటి?
మొదట రోవర్ పరికరాలను క్యాలిబరేట్ చేయాలి. ఇంజినీరింగ్‌పరమైన తనిఖీలు చేపట్టాలి. రోవర్‌లోని ‘ఇన్‌జెన్యుటీ’ని క్షేమంగా కిందకి దించాలి. ఆపై రోవర్‌ను కొద్దిదూరం తరలించాలి. హెలికాప్టర్‌ను తొలిసారిగా గగనవిహారం చేయించాలి. అనంతరం జెజెరో బిలంలోని డెల్టా ప్రాంతం గుండా రోవర్‌ను ముందుకు నడుపుతాం. బిలం అంచుకు తీసుకెళతాం. అక్కడ ఒకప్పుడు సూక్ష్మజీవులు ఉండేవా అన్న కోణంలో రోవర్ పరిశీలనలు సాగిస్తుంది. అంగారకుడి వాతావరణం, ఉపరితల పరిస్థితులపై డేటా సేకరిస్తుంది. అక్కడి శిలను తవ్వి, నమూనాలను తనలో భద్రపరచుకుంటుంది.
రోవర్ సేకరించిన నమూనాలను భూమికి ఎలా తీసుకొస్తారు?
నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు 2026లో సంయుక్తంగా రెండు ప్రయోగాలు చేపడతాయి. అందులో నాసా ల్యాండర్, ఈఎస్‌ఏ ఆర్బిటర్ ఉంటాయి. 2027లో అంగారకుడి కక్ష్యలోకి ఆర్బిటర్ చేరుతుంది. 2028లో ఆ గ్రహంపై ల్యాండర్ దిగుతుంది. ల్యాండర్‌లో ఒక రాకెట్ (మార్స్ అసెంట్ వెహికిల్), ఈఎస్‌ఏకు చెందిన 'శాంపిల్ ఫెచ్ రోవర్ (ఎస్‌ఎఫ్‌ఆర్)' ఉంటాయి. పర్సెవరెన్స్ సేకరించిన నమూనాలను ఎస్‌ఎఫ్‌ఆర్ తనలోకి తీసుకుంటుంది. అసెంట్ రాకెట్ ద్వారా ఆ నమూనాలు అంగారకుడి కక్ష్యలోని ఆర్బిటర్‌కు చేరుతాయి. నమూనాలతో ఆర్బిటర్ 2031లో భూమికి తిరిగొస్తుంది. ఆ నమూనాలను అనేక దేశాలకు అందిస్తాం. అత్యాధునిక ల్యాబ్‌లలో వీటిని విశ్లేషించి, అంగారకుడిపై జీవం ఉండేదా అన్నది పరిశీలిస్తాం.
జెజెరో బిలంలో పర్సెవరెన్స్‌కు లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతంలో అత్యంత కచ్చితత్వంతో దిగేలా ఏర్పాట్లు చేశారు. రోవర్ దిగే వృత్తం.. 1997లో పంపిన సొజర్నర్‌తో పోలిస్తే 300 రెట్లు, 2012లో పంపిన క్యూరియాసిటీతో పోలిస్తే 10 రెట్లు చిన్నగా ఉంది. దీన్ని ఎలా సాధించారు?
భూమి నుంచి పంపిన సంకేతం.. అంగారకుడిని చేరడానికి దాదాపు 11 నిమిషాల 22 సెకన్లు పడుతుంది. ఎంట్రీ, డిసెంట్, ల్యాండింగ్ (ఈడీఎల్) దశ ఏడు నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే.. మనం పంపిన సంకేతం అక్కడికి చేరే సమయానికి ల్యాండింగ్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియను రియల్ టైమ్‌లో మనం నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే సొంతంగా ఆ ప్రక్రియను చేపట్టేలా వ్యోమనౌకలను తీర్చిదిద్దాం.
ఇక మునుపటితో పోలిస్తే మా ఈడీఎల్ పరిజ్ఞానం గణనీయంగా మెరుగుపడింది. గతంలో పంపిన వ్యోమనౌకలు.. ల్యాండింగ్ సమయంలో రాడార్ సాయంతో పనిచేసేవి. ఈ దఫా.. ‘రేంజ్ ట్రిగర్ అండ్ టెరైన్ రిలెటివ్ నేవిగేషన్’ వ్యవస్థను అమర్చాం. అది ఆటో పైలట్ లాంటిది. ల్యాండింగ్ ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించింది. అక్కడికి చేరుకోవాలంటే పారాచూట్ ఎప్పుడు, ఎక్కడ విచ్చుకోవాలి.. వంటివి లెక్కించి, అవసరమైన ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా అత్యంత కచ్చితత్వంతో ల్యాండింగ్ సాధ్యమైంది. దీనివల్ల అనుకున్న సైన్స్ పరిశోధనలు సాఫీగా సాగడానికి వీలవుతోంది. నేలను పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన 'డౌన్‌వర్డ్ ఫేసింగ్ కెమెరా' అందించిన చిత్రాలను రోవర్‌లోని కంప్యూటర్‌లో ఉన్న 'విజన్ కంప్యూట్ ఎలిమెంట్.. మెరుపు వేగంతో విశ్లేషించడం వల్లే ఇది సాధ్యమైంది.
అంగారక రోవర్‌ను నిర్వహించాలంటే ఆ గ్రహ సమయానికి అనుగుణంగా మీ దైనందిన జీవితాన్ని సర్దుబాటు చేసుకోవాలి. ఇది మీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అంగారకుడిపై ఒక రోజును 'సోల్' అని పిలుస్తారు. దీని నిడివి 24 గంటల 39 నిమిషాల 35.244 సెకన్లు. భూమి మీద రోజుతో పోలిస్తే దాదాపు 40 నిమిషాల మేర ఎక్కువ. రోజులు గడిచేకొద్దీ ఆ వైరుధ్యం ఎక్కువవుతుంది. అర్ధరాత్రి వేళ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ మేరకు రోజువారీ కార్యకలాపాలను సర్దుబాటు చేసుకోవాలి. కుటుంబం, స్నేహితులతో దీన్ని సమన్వయం చేసుకోవడం ఒకింత కష్టమే. భూమి మీద తలెత్తే పగటి వెలుగులకు దూరంగా ఉంచేందుకు మా 'మిషన్ ఆపరేషన్స్' గదిలోని కిటికీలన్నింటికీ డార్క్ షేడ్స్ ఏర్పాటుచేశారు. ఒక్కోసారి అంగారకుడి సమయానికి అనుగుణంగా మిషన్ కంట్రోల్ గదిలో రాత్రి భోజనం చేసి.. బయటకొచ్చాక సూర్యోదయాన్ని చూసినప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది. శుక్రవారం నుంచి 90 సోల్స్ పాటు నా జీవితం ఇలాగే సాగుతుంది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్)తో ముడిపడిన రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. దీన్ని సరిచేసేందుకు ఏం చేయాలి?
సైన్స్ అంటే సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం. ఇది మానవాళికి చాలా కీలకం. చిన్న వయసులోనే అమ్మాయిలకు సైన్స్, ఇంజినీరింగ్ అంశాలను పరిచయం చేయాలి. ఆ ఒరవడిని అన్ని వయసుల్లోనూ కొనసాగించాలి. అంతిమంగా వారిని ఆ కెరీర్ వైపు నడిపించేలా అది ఉండాలి. ఇలాంటి సంస్కృతి కోసం మనం ప్రయత్నించాలి.
ఇదీ చూడండి: అంగారకుడిపై నవ్య చరిత్ర!