ED notices to Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. వారిని సీబీఐ, ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ ( ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ). ఈనెల 20వ తేదీన వ్యక్తి గతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ వెల్లడించింది. అయితే అసలు ఈరోజు ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత దర్యాప్తులో భాగంగా హాజరుకావాల్సి ఉంది.
Kavita in Delhi Liquor Case : ఈనెల 11న దాదాపు 8 గంటల పాటు ఈడీ అధికారులు కవితన విచారించిన విషయం తెలిసిందే. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని అదే రోజున నోటీసులు జారీ చేశారు. అయితే తాను హాజరుకాలేనని ఈడీ అధికారులకు ఈ మెయిల్ ద్వారా కవిత లేఖ పంపారు. మరో రోజున విచారణకు హాజరు అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విచారణకు హాజరుకాలేనని ఈడీకి కవిత సమాచారం అందించగా... ఈడీ అడిగిన పత్రాలను న్యాయవాది ద్వారా ఆమె పంపించారు. ఈడీకి మరో లేఖ రాస్తూ.. ఆడియో, వీడియో విచారణకు తాను సిద్ధమని.. స్పష్టం చేశారు. అధికారులు తన నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని కోరారు. తన ప్రతినిధిగా తన న్యాయవాది భరత్‌ను ఈడీకి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మరో తేదీని ఖరారు చేస్తూ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
Delhi Liquor Scam Case Update : మరోవైపు ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ కేసును ఆమె తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించి.. అత్యవసర విచారణ చేపట్టాలని కోరగా... కానీ సీజేఐ ( సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ) వెంటనే విచారణ చేపట్టడానికి నిరాకరించారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీ వరకు వాయిదా వేశారు.
ఇక కవిత ఈడీ విచారణ నేపథ్యంలో నిన్ననే ఆమె దిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్ పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హస్తీన వెళ్లారు.
ఇవీ చదవండి: