Five States election in 2022: దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు శంఖారావం మోగింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.
UP election schedule 2022
403 సీట్లతో దేశంలో అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. యూపీలో ఫిబ్రవరి 10న మొదటి విడత, మార్చి 3న ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఫిబ్రవరి 14న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
5 states election date 2022
మణిపుర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27, మార్చి 3న పోలింగ్ జరగనుంది.
పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెంపు
కరోనా నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచినట్లు ఈసీ తెలిపింది. అదనంగా 30,330 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,15,368గా ఉండనున్నట్లు వివరించింది. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 1,250 మంది ఓటర్లు ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఓటు వేసే వారి సంఖ్య 1,500గా ఉండేదని పేర్కొంది. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచుతున్నట్లు వెల్లడించింది.
5 States election votes
ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల ముఖచిత్రం
- మొత్తం అర్హులైన ఓటర్లు- 18 కోట్లు
- మహిళా ఓటర్లు- 8.5 కోట్లు
- కొత్త ఓటర్లు- 24.9 లక్షలు
- కొత్తగా నమోదైన మహిళా ఓటర్లు- 11.4 లక్షలు
- మొత్తం పోలింగ్ స్టేషన్లు- 2,15,368
భౌతిక ప్రచారాలు బంద్!
- కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
- జనవరి 15 వరకు భౌతిక భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
- విజయోత్సవ సంబరాల పైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.
- జనవరి 15న కరోనా పరిస్థితిని అంచనా వేసి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది.
- కరోనా నిబంధనలు పాటించకపోతే.. జనవరి 15 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగించేందుకు ఈసీ వెనకాడదని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు.
కరోనా జాగ్రత్తలతో..
కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచించినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది అంతా రెండు టీకాలు తీసుకున్నవారే ఉంటారని స్పష్టం చేసింది.
ఎన్నికల సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లలా పరిగణించి బూస్టర్/ప్రికాషన్ డోసు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని లబ్ధిదారులకూ వేగంగా టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు స్పష్టం చేసింది.
"ఐదు రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు టీకాలను వేగంగా అందించాలని అధికారులను కోరాం. ఐదు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల మంది లబ్ధిదారులు తొలిడోసు టీకా అందింది. 9 కోట్ల మంది లబ్ధిదారులు రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. జనవరి 7 నాటికి గోవాలో 98 శాతం లబ్ధిదారులకు రెండు డోసులు అందాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 90 శాతం మంది తొలి డోసు, 52 శాతానికి పైగా లబ్ధిదారులు రెండు డోసులు తీసుకున్నారు. ఉత్తరాఖండ్ 99.6 శాతం లబ్ధిదారులు తొలి డోసు, 83 శాతం మంది రెండు డోసులు అందుకున్నారు. మణిపుర్ 57 శాతం మంది లబ్ధిదారులకు తొలి డోసు, 43 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారు."
-ఈసీ
ఆన్‌లైన్ నామినేషన్లకు అవకాశం..
మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్ నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చని తెలిపారు. దీని వల్ల రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.40లక్షలకు పెంపు..
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చును రూ. 40లక్షలకు పెంచుతున్నట్లు సీఈసీ వెల్లడించారు. ఇక క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్లలో తెలియజేయాలని పేర్కొన్నారు. ఆ అభ్యర్థులను ఎందుకు ఎన్నుకున్నారో కారణాలు కూడా చెప్పాలని తెలిపారు.
మహిళా పోలింగ్ బూత్‌లు...
ఐదు రాష్ట్రాల్లో మహిళల ఓటింగ్ క్రమంగా పెరుగుతోందని, దీన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ స్టేషన్ పూర్తిగా మహిళల చేతుల మీదుగా నడిపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఇది మహిళల పోలింగ్‌ను మరింత పెంచేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: 'రైళ్లలో ప్రయాణించాలంటే.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి'