లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న సమయంలో తమలోని కళను బయటపెట్టి ప్రశంసలు అందుకున్నారు పలువురు. అలాంటి కోవకే చెందుతారు కర్ణాటక దొడ్డబళ్లాపుర్కు చెందిన అంబిక. దొరికిన ఖాళీ సమయంలో తనలోని చిత్రకళకు పదునుపెట్టింది. అయితే.. పేపర్‌పై కాదండోయ్.. తన ఇంటి గోడలను అందమైన చిత్రాలతో నింపేసింది. ఇంటిని అందమైన బొమ్మల పొదరిల్లుగా మార్చేసి అందరి ప్రశంసలు అందుకుంటోంది.
కర్ణాటకలోని దొడ్డబళ్లాపుర్కు చెందిన చిన్నమ్మ, మంజునాథ దంపతుల కూతురు అంబిక. ఆమెకు చిత్రలేఖనం అంటే చాలా ఇష్టం. లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటూ.. వినూత్న రీతిలో ఆలోచన చేసింది. ఇంటి గోడలపై బుద్ధుడు, ప్రకృతి సౌదర్యాలు, మహిళలకు సంబంధించిన చిత్రాలు వేసింది. అలా ఇంటినంత ఒక 'బొమ్మల గ్యాలరీ'గా మార్చేసింది. అయితే గోడలు పాడవుతాయేమోనని తల్లిదండ్రులు మొదట కంగారు పడ్డారు. కానీ ఇప్పుడా అందమైన చిత్రాల్ని చూసి మురిసిపోతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఈ చిత్రాల్ని చూసి తమ ఇంటికి కూడా ఇలాంటి బొమ్మల్ని వేయమని తన స్నేహితులు అడుగుతున్నారని చెబుతొంది అంబిక. గోడలపైనే కాదు.. బీర్ బాటిల్‌పై, రాళ్లపై.. చిత్రాల్ని గీస్తూ వాటిని అందమైన కళాకండాలుగా మార్చుతోంది.
ఆమె గీసిన వాటిల్లో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే 'వర్లీ ఆర్ట్' చిత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. పల్లెటూరి ఇల్లా? అన్నటుంది ఆ ఇల్లు. 'మండల్ ఆర్ట్' తదితర రకాల ఆర్ట్‌ను కూడా ఆమె వేస్తుంది.
"చాలా రకాలుగా పెయింటింగ్ వేయడానికి ప్రయత్నించాను. ఈ క్రమంలోనే పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే వర్లీ ఆర్ట్‌ని మా ఇంటి గోడలపై వేశాను. మండల ఆర్ట్‌ను కూడా వేయడం వచ్చు. ఈ చిత్రాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాను. దాంతో చాలా మంది నా స్నేహితులు వారి ఇంటిలో కూడా ఇలాంటి పెయింటింగ్స్ వేయమని కోరుతున్నారు."
-అంబిక, చిత్రకారిణి
ఇలా అలవోకగా అందమైన చిత్రాల్ని గీసే అంబిక.. బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్‌లో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేసింది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డ్రాయింగ్ పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.
ఇదీ చదవండి: ఆదర్శ రైతన్న- వర్షపు నీటి కోసం 6కోట్ల లీటర్ల కుంట