Drugs Trafficking: అసోంలో 1.04 కేజీల హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల విలువ రూ.7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నారు. ముందస్తు సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు.
రూ.6.7 కోట్ల హెరాయిన్..
కోల్‌కతాలో రూ.6.7 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్రమంగా తరలింపునకు పాల్పడ్డ ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితున్ని ఝార్ఖండ్ వాసి పరాన్ బసక్గా (46) గుర్తించారు.
సరిహద్దుల్లో రూ.75 కోట్ల హెరాయిన్..
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంట భారీ స్థాయిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. బాలాకోట్ సెక్టార్లో పోలీసులు, ఆర్మీ అధికారులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో 15 కిలోల మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి.
హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.75 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒకే బ్యాగులో కిలో బరువు కలిగిన 15 చిన్న బ్యాగుల్లో ఈ మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పూంచ్ సీనియర్ ఎస్పీ రోహిత్ బస్కోత్రా తెలిపారు. వివిధ సెక్షన్ల కింద మెంధర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయని, దేశంలోకి ఆయుధాలు, డ్రగ్స్, చొరబాట్ల ప్రయత్నాలను సఫలం కానివ్వబోమని స్పష్టం చేశారు.
కిశ్త్వారా జిల్లాలో..
జమ్ముకశ్మీర్ కిశ్త్వారా జిల్లాలోని పర్నా గ్రామంలో ఓ వ్యక్తి నుంచి 8.9 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు అబ్దుల్ లతీఫ్‌గా గుర్తించారు.
ఇదీ చదవండి: రోజంతా బోరుబావిలోనే చిన్నారి.. లక్కీగా...