HEROIN SEIZURE Lakshadweep: లక్షద్వీప్ తీరం నుంచి మాదకద్రవ్యాలను తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాను అరెస్ట్ చేశారు అధికారులు. వారి నుంచి 218 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లు సుమారు రూ. 15వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) లక్షద్వీప్‌లోని అగట్టి తీరంలో ఈ ఆపరేషన్‌ను సంయుక్తంగా నిర్వహించాయి. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది డీఆర్ఐ. మే రెండోవారంలో తమిళనాడులోని తీరం గుండా సముద్రంలోకి వెళ్లిన రెండు బోట్లు.. భారీ ఎత్తున డ్రగ్స్‌ను తీసుకొచ్చినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు మే 7న 'ఆపరేషన్ ఖోజ్బీన్' చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఐసీజీ షిప్ సుజీత్‌లో డీఆర్ఐ అధికారులు.. దేశ ముఖ్యమైన ఆర్థిక జోన్లో నిఘా వేశారు. కొద్ది రోజులకు రెండు అనుమానిత బోట్లు ప్రిన్స్, లిటిల్ జీసెస్‌లు భారత్‌వైపు వెళ్లటాన్ని గుర్తించారు.
మే 18న ఆ రెండు బోట్లను డీఆర్ఐ, ఐసీజీ అధికారులు లక్షద్వీప్ ద్వీపాల్లోని తీరంలో అడ్డుకున్నారు. అందులోని సిబ్బంది విచారించగా.. భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు అంగీకరించారు. ఈ క్రమంలో రెండు బోట్లను కొచ్చికి తరలించారు. కొచ్చిలోని కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కేంద్రంలో బోట్లను తనిఖీ చేశారు. కిలో బరువుతో ఉన్న 218 ప్యాకెట్ల హెరాయిన్ దొరికింది. ఎన్డీపీఎస్ చట్టం 1985 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. సీజ్ చేసిన డ్రగ్స్ హైగ్రేడ్ హెరాయిన్‌గా గుర్తించారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.1,526 కోట్లుగా అంచనా వేశారు.
ఇదీ చూడండి: నల్ల బంగారం గనుల్లో 'కేజీయఫ్' తరహా కుంభకోణం.. వీడియో వైరల్!