Drugs seized in Assam: అసోంలోని సోనాపుర్ జిల్లాలో బుధవారం భారీస్థాయిలో మత్తుపదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.130 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసులో మణిపుర్‌కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.
డ్రగ్స్‌పై విశ్వసనీయ వర్గాల నుంచి మంగళవారం రాత్రి సమాచారం అందిన క్రమంలో సోనాపుర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని టోల్గేట్ వద్ద ఓ ట్రక్కులో సోదాలు నిర్వహించగా భారీస్థాయిలో డ్రగ్స్ బయటపడ్డాయి. వాటిని మణిపుర్ నుంచి అసోంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అందులో 4.6 లక్షల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల మెథంఫెటమైన్, 1.5 కిలోల హెరాయిన్ ఉన్నట్లు చెప్పారు.
భారీస్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకున్న పోలీసులు, అధికారులపై ప్రశంసలు కురిపించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.
" డ్రగ్స్‌ను అరికట్టటంలో అసోం పోలీసులు మరో విజయం సాధించారు. వివేకానంద దాస్, ఏడీసీపీ ఈస్ట్, నవజిత్ నాథ్, ఓసీ సోనాపుర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక ఆపరేషన్‌లో 4.6 లక్షల యాబా ట్యాబ్లెట్లు, 12 కిలోల మెథంఫెటమైన్, 1.5 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మంచి పని చేస్తున్నారు. ఇలాగే కొనసాగాలి. "
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి.
ఇదీ చూడండి: 'దిల్లీ క్యాపిటల్' బస్సు అద్దాలు ధ్వంసం.. ఐదుగురు అరెస్ట్