మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు కరోనా నిర్ధరణ అయిన క్రమంలో ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఎయిమ్స్ వైద్య బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆరా తీశారు. ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
"దిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందంతో మన్మోహన్ సింగ్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశాను. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఉత్తమమైన చికిత్స ఆయనకు అందుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని మనమంతా ఆకాంక్షిద్దాం."
-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
మన్మోహన్ సింగ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనకు మంగళవారం ఓ లేఖ రాశారు.
"మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు తెలిసినట్లుగా.. ఓ పాత స్నేహితుడిగా మీరంటే నాకు అపారమైన గౌరవం."
-దలైలామా, టిబెట్ ఆధ్యాత్మిక గురువు
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే అంతమవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు దలైలామా తన లేఖలో పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్‌కు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి: మన్మోహన్ కోలుకోవాలని మోదీ, రాహుల్ ఆకాంక్ష
ఇదీ చూడండి: 'టీకాపై అనుమానాలు పెంచటంలోనే కాంగ్రెస్ బిజీ'