Ambedkar death anniversary: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 65వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం నివాళులు అర్పించారు. పార్లమెంటు ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలు జల్లి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.


లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర పార్లమెంటు సభ్యులు కూడా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.


'చేయాల్సింది చాలా ఉంది'
అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ప్రస్తుతం దేశంలోని పరిణామాలను చూస్తోంటే.. అంబేడ్కర్ కలలు ఇంకా నెరవేరలేదనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
"దేశంలో సామాజిక అన్యాయం, హింస, వివక్ష చూస్తున్నప్పుడు... బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలు నెరవేరాలంటే చేయాల్సింది ఇంకా చాలా ఉందని నేను భావిస్తాను. కానీ, మనం తప్పకుండా దాన్ని సాధిస్తాం. ఆయనకు నా నివాళులు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
'వారికి దక్కట్లేదు..'
అంబేడ్కర్‌కు బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి నివాళులు అర్పించారు. "అణగారిన ప్రజలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అంబేడ్కర్ ఎంతో కృషి చేశారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ఆయా వర్గాల వారికి అందించిన ప్రయోజనాలు... ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న కులతత్వ ప్రభుత్వాల కారణంగా వారికి దక్కట్లేదు" అని ఆమె ఆరోపించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. భారత రాజ్యాంగ రచనలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1956 డిసెంబరు 6న కన్నుమూశారు. 1990లో అంబేడ్కర్‌ను భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'తో ఆనాటి ప్రభుత్వం సత్కరించింది.
అంబేడ్కర్ వర్ధంతిని 'మహాపరినిర్వాణ్ దివస్'గా నిర్వహించుకుంటారు.
Tags: br amedkar death anniversary, pm modi tributes to ambedkar, president tributes to ambedkar, Mahaparinirvan Diwas
ఇదీ చూడండి: రాజీనామా చేస్తా అంటే మోదీ వద్దన్నారు: దేవెగౌడ
ఇదీ చూడండి: 'దేశాభివృద్ధికి వారిని జవాబుదారీగా చేయాలి'