ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా.. ఇతర పార్టీలు మూకుమ్మడిగా బరిలోకి దిగాలని సూచించారు. చిన్నపార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఎస్పీ తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయని పీటీఐ వార్తాసంస్థ ముఖాముఖిలో పేర్కొన్నారు.
తమపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేయడంపై స్పందించారు అఖిలేశ్. కాంగ్రెస్ పోరాడాల్సింది భాజపాతోనా లేక ఎస్పీతోనా అని వారు తెలుసుకోవాలని సూచించారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూడా తాము పోరాడాల్సింది ఎవరిపై అనేది ఆలోచించాలని పేర్కొన్నారు.
ఎస్పీపై విమర్శలు..
బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి.. సమాజ్వాదీ పార్టీపై పలు ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లో భాజపా గెలుపునకు, ఎస్పీ పాలనకు లంకె పెట్టారు. గతంలో ఎస్పీ చేసిన విధంగానే భాజపా.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని గెలుపు సొంతం చేసుకుందని మాయావతి ఆరోపించారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా ఎస్పీపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చదవండి:'భాజపా వ్యాక్సిన్ను తీసుకునే ప్రసక్తే లేదు'
ఇతర పార్టీలపై..
శివ్పాల్ యాదవ్ సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసేందుకు సిద్ధమవుతున్న ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీనీ ప్రస్తావించారు అఖిలేశ్ యాదవ్. అన్ని పార్టీలు కలిసి భాజపాను ఓడించేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, శూల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్భర్ కలిసి ఏర్పాటు చేసిన భాగీదారీ మోర్చాతో పొత్తుపై వారితో ఇంకా చర్చించలేదని తెలిపారు.
యాత్ర షురూ..
బీఎస్పీ సహా ఇతర పార్టీలు.. బ్రాహ్మణుల సమ్మేళనాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎస్పీ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయనుందని తెలిపారు అఖిలేశ్.
"ఎస్పీ నేత జనేశ్వర్ మిశ్రా జయంతి సందర్భంగా ఆగస్టు 5న యాత్ర చేపడతాం. భాజపా పాలనను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15 నుంచి మరిన్ని యాత్రలు చేపట్టనున్నాం."
-అఖిలేశ్ యాదవ్.
పెగసస్ నిఘా వ్యవహారంలోనూ కేంద్రాన్ని తప్పుబట్టారు అఖిలేశ్.
ఇదీ చదవండి:2022 ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల బరిలో ఆమ్ఆద్మీ
కొవిడ్ పరిస్థితులను ఎదుర్కోవడంలో యోగి సర్కారు పూర్తిగా విఫలమైందని అఖిలేశ్ ఆరోపించారు. ఆక్సిజన్, మెడిసిన్, పడకగదులు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు భాజపాకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. గంగానది ప్రక్షాళన, ధరల పెంపు, ఇతర అంశాలపై భాజపా ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
అభ్యర్థుల ప్రకటన అప్పుడే..
ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులెవరనేదానిపై స్పష్టత ఇచ్చారు అఖిలేశ్. 'ఎంపికకు ఇంకా చాలా సమయం ఉంది. చర్చలు, విశ్లేషణ తర్వాతే సరైన సభ్యులను బరిలోకి దింపుతాం' అని అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ 350 సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యువత, అభివృద్ధి కార్యక్రమాలు, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం.. ప్రధానాంశాలుగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు అఖిలేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:వేడెక్కిన రాజకీయం- చిన్న పార్టీలతోనే అసలు చిక్కులు