'నందిగ్రామ్ గురించి చింతించొద్దు.. తీర్పు ఏదైనా ఓకే' - దీదీ
నందిగ్రామ్ గురించి చింతించొద్దని ప్రజలకు సూచించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అక్కడి ప్రజల తీర్పును అంగీకరిస్తామన్నారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో తిరుగులేని పార్టీగా అవతరించింది తృణమూల్ కాంగ్రెస్. మూడోసారి అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీ సాధించింది. ఈ క్రమంలో ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు.
" ఎన్నికల్లో ఘన విజయం అందించిన ప్రజలకు నా కృతజ్ఞతలు. వెంటనే కొవిడ్-19పై పోరాటాన్ని ప్రారంభిస్తాను. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనేది చాలా చిన్న అంశం. ఎన్నికల్లో భాజపా ఓడిపోయింది. వారు స్వార్థ రాజకీయలు చేశారు. ఎన్నికల సంఘం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నందిగ్రామ్ గురించి చింతించకండి. నందిగ్రామ్ కోసం నేను పోరాడాను. నందిగ్రామ్ ప్రజలకు కావాల్సిన తీర్పును ఇవ్వనివ్వండి. దానిని నేను అంగీకరిస్తా. మేము 221కుపైగా సీట్లు సాధించాం. భాజాపా ఓడిపోయింది. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.