'స్వరం పెంచొద్దు. నన్ను బెదిరించొద్దు. ఈ కోర్టు నుంచి బయటకు వెళ్లిపోండి' అంటూ సీనియర్ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్‌తో గురువారం తీవ్ర వాగ్వాదం నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అనూహ్య పరిణామంపై ఇతర సీనియర్ న్యాయవాదులు విచారం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ తరఫున ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు.
సుప్రీంకోర్టు భూమిని తమకు ఇవ్వాలని..
న్యాయవాదుల ఛాంబర్ల కోసం భూమి కేటాయించడానికి సంబంధించిన కేసును గురువారం ఉదయం వికాస్ సింగ్.. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దీవాలాతో కూడిన ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఆ కేసు విచారణకు వచ్చేలా చూసేందుకు తాను 6 నెలలుగా కష్టపడుతున్నానని చెప్పారు. "సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వేసిన పిటిషన్ కారణంగా అప్పూఘర్ భూమి సర్వోన్నత న్యాయస్థానానికి దక్కింది. అయితే.. అందులో కొంత భాగాన్ని మాత్రమే అయిష్టంగా బార్ అసోసియేషన్‌కు ఇచ్చారు. జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆ భూమిలో నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. ఈ కేసు విచారణకు వచ్చేలా చూసేందుకు మేము 6 నెలలుగా కష్టపడుతున్నాం. నన్ను ఒక సాధారణ కక్షిదారుడిగానే పరిగణించండి" అని అన్నారు వికాస్ సింగ్.
వికాస్ సింగ్ వ్యాఖ్యలపై సీజేఐ తీవ్రంగా స్పందించారు. "కేసును విచారించాలని మీరు ఇలా డిమాండ్ చేయకూడదు. మేము రోజంతా ఖాళీగా కూర్చుంటున్నామని మీరు అంటున్నారా?" అని ప్రశ్నించారు. ఇందుకు వికాస్ దీటుగా బదులిచ్చారు. "మీరు రోజంతా ఖాళీగా కూర్చుంటున్నారని నేను అనడం లేదు. కేసును విచారణకు చేపట్టేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నా. అలా కుదరకపోతే.. మీ ఇంటికే రావాల్సి ఉంటుంది." అని అన్నారు.
వికాస్ వ్యాఖ్యలతో జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. "ప్రధాన న్యాయమూర్తిని బెదిరించొద్దు. ప్రవర్తించే తీరు ఇదేనా? దయచేసి కూర్చోండి. ఇలా అడిగినంత మాత్రాన విచారణకు చేపట్టరు. దయచేసి నా కోర్టు నుంచి బయటకు వెళ్లండి. నేను మీకు భయపడను" అని స్పష్టం చేశారు. "మిస్టర్ వికాస్ సింగ్.. దయచేసి స్వరం పెంచొద్దు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. మీరు న్యాయవాదులకు మెంటార్‌గా, నాయకుడిగా ఉండాలి. కానీ మీరు చర్చ స్థాయిని తగ్గిస్తున్నారు. సుప్రీంకోర్టుకు అప్పజెప్పిన భూమిని ఛాంబర్ల నిర్మాణం కోసం బార్ అసోసియేషన్‌కు అప్పగించాలని కోరుతూ ఆర్టికల్ 32 పిటిషన్‌ను మీరు దాఖలు చేశారు. తగిన సమయంలో ఆ కేసును విచారిస్తాం. మీకు కావాల్సిన తీర్పు కోసం ఒత్తిడి చేయొద్దు. మార్చి 17న విచారణ జరుగుతుందని ఇప్పటికే చెప్పా. కానీ.. ఆ రోజున తొలి కేసుగా మాత్రం ఇది ఉండదు." అని మండిపడ్డారు.
సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ మళ్లీ తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. "కావాలంటే ఆ పిటిషన్‌ను కొట్టేయండి. కానీ విచారణకు రాకుండా మాత్రం చేయొద్దు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీజేఐ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 17న విచారణకు వస్తుందని చెప్పాం కదా అని గుర్తు చేశారు. అయినా.. వికాస్ సింగ్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. "కోర్టుకు బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా నిలిచింది. నేను ఎప్పుడూ అనుచితంగా వ్యవహరించను. కానీ ఈ కేసు విషయంలో తప్పడం లేదు" అని బదులిచ్చారు.
"నేను ప్రధాన న్యాయమూర్తిని. 2000 మార్చి 29 నుంచి ఇక్కడ ఉన్నా. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. న్యాయవాదులు, కక్షిదారులు, మరెవ్వరూ నన్ను బెదిరించే అవకాశం ఇవ్వలేదు. నా కెరీర్ చివరి రెండు సంవత్సరాల్లోనూ అలా జరగనివ్వను." అని తేల్చిచెప్పారు జస్టిస్ చంద్రచూడ్. అయినా.. వికాస్ సింగ్ ఆగలేదు. "ఇది సరైన తీరు కాదు. కోర్టుకు బార్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన.. మమ్మల్ని తేలికగా తీసుకోకూడదు." అని వ్యాఖ్యానించారు. ఇందుకు సీజేఐ.. "మీ అజెండా ఏమైనా ఉంటే కోర్టు బయట చూసుకోండి" అని బదులిచ్చారు. ఈ విషయాన్ని వదిలేసి.. తదుపరి కేసును విచారణ చేపట్టారు.
క్షమించండి..
శివసేనకు సంబంధించిన ఓ కేసు కోసం కోర్టుకు వచ్చిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. సీజేఐ-వికాస్ సింగ్ వాగ్వాదంపై స్పందించారు. కేసుల విచారణ పూర్తయ్యాక.. ఈ వ్యవహారాన్ని ప్రస్తావించారు. "ఈ ఉదయం జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నా. ఎవరూ లక్ష్మణ రేఖను దాటకూడదు. కోర్టు హుందాతనం పరిమితుల్ని బార్ అసోసియేషన్ దాటకుండా ఉండాల్సింది" అని సీజేఐ దగ్గర విచారం వ్యక్తం చేశారు. సిబల్ క్షమాపణలపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. "ఇలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మేము రోజంతా కూర్చుని 70-80 కేసులు వింటున్నాం. మళ్లీ సాయంత్రం నా సిబ్బందితో కూర్చుని.. ఈ కేసుల తదుపరి విచారణకు తేదీలు చెబుతున్నా" అంటూ న్యాయమూర్తులపై ఉన్న పని భారం గురించి చెప్పారు. ఇదే విషయమై సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ కూడా ప్రధాన న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పారు.