హిందుత్వ విషయంలో భాజపా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీనాయక్ దమోదర్ సావర్కర్‌కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ పేరు పెడితే, వారు మాత్రం పటేల్ స్టేడియం పేరును మార్చేసి మోదీ స్టేడియం అని పెట్టారని ఎద్దేవా చేశారు. వారి నుంచి హిందుత్వ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో శివసేన పాల్గొనలేదన్న ఉద్ధవ్.... భాజపా మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కూడా పాల్గొనలేదని చెప్పారు. కేవలం భారత్ మాతాకీ జై అన్నంత మాత్రాన దేశభక్తులైపోరని విరుచుకుపడ్డారు.