బెంగుళూరు బీబీఎంపీ ఆసుపత్రిలో చిన్నారిని అపహరించిన కేసులో ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు సిటీ సౌత్ వింగ్ పోలీసులు. చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ జరిగింది..
డాక్టర్ రష్మి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మానసిక నిపుణురాలిగా పనిచేస్తున్నారు. 2014లో హుబ్బళ్లీలోని ఎస్డీఎమ్ ఆసుపత్రిలో ఆమెకు ఓ జంట పరిచయమైంది. వారి కూతురు మానసిక వ్యాధులతో బాధపడుతోందని ఆ జంటను రష్మిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సరోగసి విధానం ద్వారా మరో సంతానం పొందమని ఆ జంటకు సలహా ఇచ్చారు.
అయితే.. ఆ జంటకు శిశువును ఇచ్చేందుకు రష్మి.. ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డను అపహరించాలనుకున్నారు. ఇందుకోసం రెండు మూడు ఆసుపత్రులు తిరిగారు. చివరగా గతేడాది మే 29న చమరాజిపేట్ ఆసుపత్రిలో ఓ చిన్నారిని అపహరించారు.
ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిమరాజిపేట్ ఠాణాలో కేసు నమోదైంది. దాదాపు ఏడాది పాటు దర్యాప్తు చేపట్టి డాక్టర్.రష్మిని అరెస్టు చేశారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. కిడ్నాప్ సమయంలో సమీపంలోని టవర్ లొకేషన్లో ఉన్న 800 మందిని విచారించినట్లు పేర్కొన్నారు. చివరగా పోలీసుల విచారణలో రష్మి తప్పు ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు.
డాక్టర్ రష్మి.. రూ.15 లక్షలకు చిన్నారిని ఓ జంటకు అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో.. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల నుంచి చిన్నారిని తీసుకుని.. డీఎన్ఏ సహా పలు పరీక్షలు నిర్వహించాక తన సొంత తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ప్రజలు రోడ్లపై నడుస్తూ చనిపోతారు- స్వామీజీ జోస్యం!