వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నైలో డీఎంకే ఆధ్వర్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. డీఎంకే అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ సహా పెద్ద సంఖ్యలో రైతులు, ఆ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డీఎంకే కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని స్టాలిన్ తెలిపారు. పంజాబ్, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే తొలి ప్రాధాన్యం అని చెప్పే తమిళనాడు సీఎం పళనిస్వామి కొత్త చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదని స్టాలిన్ ప్రశ్నించారు.
బిహార్ రాజధాని పట్నాలో సైతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది.