'ప్రధానిగారు.. దయచేసి మా నియోజకవర్గంలోని ఏఐఏడీఎంకే, భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేయండి. మేం భారీ తేడాతో గెలిచేందుకు మీ ప్రచారం సహకరిస్తుంది' అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ నేతలు కొందరు వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు. ఎన్.రామక్రిష్ణన్, ఈవీ వేలుతో సహా పలువురు నేతలు ట్విటర్‌లో అభ్యర్థించారు. శుక్రవారం నరేంద్ర మోదీ భాజపా అభ్యర్థుల తరఫున మధురై, కన్యాకుమారిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డీఎంకే నేతల స్పందన వెలువడింది.
"ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ.. మీరు కుంభం నియోజకవర్గంలో ప్రచారం చేయండి. నేను ఈ ప్రాంతంలో డీఎంకే తరఫున బరిలో ఉన్నాను. నేను భారీ తేడాతో విజయం సాధించేందుకు మీ ప్రచారం సహకరిస్తుంది" అని రామక్రిష్ణన్ ట్వీట్ చేశారు. తాను తిరువణ్ణమలై స్థానం నుంచి బరిలో ఉన్నానని.. ఆ స్థానంలో ప్రచారం చేయండంటూ ఈవీ వేలు ట్విటర్‌లో స్పందించారు.
అనితా రాధాక్రిష్ణన్, సెల్వరాజ్ కే, అంబేత్ కుమార్ వంటి తదితర నేతలు కూడా ఇదే తరహా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే ఏఐఏడీఎంకే అభ్యర్థి, తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి తరఫున ప్రచారం చేయాలని డీఎంకే అభ్యర్థి కార్తికేయ శివసేనాపతి మోదీని అభ్యర్థించారు. 'మీరు ఆయనకు మద్దతు ఇస్తే, నాకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది' అని గురువారం నెట్టింట్లో పోస్టు చేశారు. ఇలా ఈ నేతలంతా సరికొత్త శైలిలో తమ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ ఆరున 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో భాజపా, ఏఐఏడీఎంకేతో కలిసి పోటీ పడుతోంది.
ఇదీ చదవండి:మహారాష్ట్రలో కరోనా రికార్డు- కొత్తగా 48వేలు కేసులు