తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థిపార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. జనంలోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు డీఎంకేను ఎందుకు తిరస్కరించాలో పేర్కొంటూ 100 కారణాలతో భాజపా ఛార్జిషీటు విడుదల చేసింది. ఛార్జిషీటును భాజపా కార్యాలయంలో తమిళనాడు భాజపా ఇన్ఛార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, కేంద్ర మంత్రి వీకే సింగ్ విడుదల చేశారు.
డీఎంకేవి వారసత్వ రాజకీయాలు అని ఆరోపించారు రవి. అది కాంగ్రెస్ బాటలోనే ప్రజాస్వామ్య వ్యతిరేకమని అన్నారు.
''డీఎంకే అంటేనే వారసత్వ రాజకీయాలు. కరుణానిధి తర్వాత స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఉదయనిధే యజమాని అవుతారు. డీఎంకే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రోజూ కుంభకోణాలు జరిగాయి. 2జీ స్కాంను తమిళనాడు ప్రజలు మరచిపోలేదు.''
- సీటీ రవి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
అసత్యాలు ప్రచారం చేస్తూ డీఎంకే ప్రజలను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు రవి. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా తమిళనాడు విద్యార్థులకు మెరుగైన అవకాశాల కల్పనకు కృషిచేస్తుంటే, డీఎంకే మాత్రం వారి అవకాశాలను దెబ్బతీయాలని చూస్తోందన్నారు.
అధికారంలో ఉన్న సమయంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం.. జల్లికట్టును రద్దు చేసిందని, కావేరి జల వివాదం విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందన్నారు.
అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా భాజపా.. తమిళనాడులో 20 చోట్ల పోటీ చేస్తోంది.
రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.
ఇవీ చదవండి: