దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇంటింటా దీపాలతో వెలుగు జిలుగులు ప్రకాశించాయి. స్వీట్లు, బహుమతులు పంచుకుని పండగను మరింత ఉల్లాసంగా జరుపుకున్నారు. టపాసులు, బాణసంచా పేలుళ్లతో నగరాలు, పట్టణాల్లోని వీధులన్నీ పండగ శోభను రెట్టింపు చేశాయి. కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల చిన్నా, పెద్దా తేడా లేకుండా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు ఈసారి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలన్నింటినీ సంప్రదాయ దీపాలతో అలకరించారు.
కొన్ని రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధించగా... మరికొన్ని రాష్ట్రాలు నిర్దిష్ట సమయం వరకే కాల్చాలని నిబంధనలు విధించాయి. ఇప్పటికే దేశరాజధాని దిల్లీలో గాలికాలుష్యం ఏర్పడగా... దీపావళి టపాసులతో గాలి నాణ్యత తీవ్రస్థాయికి పడిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంజాబ్‌లో కేవలం పర్యావరణహిత బాణసంచానే కాల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసుల కాల్చాలని పక్కా ఆదేశాలు జారీ చేసింది. చండీగఢ్‌లో బాణసంచా విక్రయాలు, పేల్చడంపై పూర్తి నిషేధాన్ని విధించారు. హరియాణాలోని 14 జిల్లాల్లో అన్ని రకాల బాణసంచా విక్రయాలు, కాల్చడాన్ని నిషేధించినప్పటికీ... గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో అధిక తీవ్రత కలిగిన టపాసులను పేల్చారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు- అంబరాన్నంటేలా సంబరాలు