Diwali 2023 Celebrated Five Days in India : చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందంగా చేసుకొనే వెలుగుల పండుగ దీపావళి. అమావాస్య చీకట్లను పారదోలి తమ జీవితంలో వెలుగులు నింపే సంతోషాల సంబరమిది. అయితే చాలా మంది ఈ తరంలో దీపావళి(Diwali 2023) అంటే ఒక్కరోజు పండుగే అనుకుంటారు. ఆ రోజు లక్ష్మీ పూజను చేసి టపాసులు కాల్చడంతో పండగ పూర్తయిందని అనుకుంటారు. నిజానికి ఈ దీపాల పండగ ఐదు రోజుల పాటు జరుపుకునే ఆనందాల వేడుకని మీకు తెలుసా?
5 Days of Diwali 2023 : దీపావళి ఐదు రోజుల పండుగలో ఒక్కోరోజు ఒక్కో ప్రాముఖ్యత, గుర్తింపు కలిగి ఉంది. ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడుని ఆరాధిస్తారు. ఈ ఐదు రోజుల పండగ ధంతేరాస్(Dhanteras 2023) షాపింగ్‌తో మొదలై.. నరక చతుర్దశి, దీపావలి అమావాస్య, బలి పాడ్యమి, భాయిదూజ్తో ముగుస్తుంది. అయితే విశిష్టతల కలబోతైన ఐదు రోజుల దివాళీ గురించి పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు జరుపుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ధన త్రయోదశి.. హిందూ ధర్మంలో దక్షిణాయనానికి అందులోను ఆశ్వయుజ, కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దక్షిణాయనంలో ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీకమాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు ఈ 5 రోజులూ దీపాల పండుగ ప్రత్యేకంగా జరుపుకొంటారు. ఇందులో తొలి రోజు ధన త్రయోదశి/ధంతేరాస్‌గా జరుపుకుంటాం.
అశ్వయుజ మాసంలోని త్రయోదశి తిథి నాడు సముద్ర మథన సమయంలో ధన్వంతరి ఉద్భవించాడు. అప్పటి నుంచి ఈ ధంతేరాస్ మొదలైంది. ఈ రోజు కొత్త వస్తువులు(ముఖ్యంగా బంగారం) కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం ఒక సంప్రదాయం. అలాగే దీపాలను దానం చేయాలనే నమ్మకం కూడా ఉంది. ఫలితంగా యమరాజు సంతోషించి.. ఆశీర్వాదాన్ని ఇస్తాడని నమ్ముతారు. ఈ ఏడాది ధంతేరాస్‌ను నవంబర్ 10, 2023న జరుపుకోనున్నారు.
నరక చతుర్దశి.. ద్వాపర యుగంలో ఈ ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథిలో శ్రీ కృష్ణుడు, సత్యభామ తో కలిసి లోక కంటకుడైన నరకాసురుడిని సంహరించాడు. అప్పటి నుంచి ఈరోజున నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలంతా ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేస్తారు. అలాగే ఈ నరక చతుర్దశి రోజున ఐదు లేదా ఏడు దీపాలు వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఈసారి 11 నవంబర్ 2023 న ఈ పండగను జరుపుకోనున్నారు.
దీపావళి ఎప్పుడు - 12నా? 13వ తేదీనా? పంచాంగం ఏం చెబుతోంది?
దీపావళి అమావాస్య.. సత్యయుగంలో ఆశ్వయుజ మాసంలోని అమావాస్యనాడు సముద్ర మథనం నుంచి తొలిసారిగా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవి వివాహం కూడా జరిగినట్లు పురాణ కథనం. దాంతో అప్పటి నుంచి దీపావళి సంబరాలు మొదలయ్యాయి. తర్వాత త్రేతాయుగంలో ఈ రోజున, రాముడు వనవాసం నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ రోజున దరిద్ర దేవతను వెళ్లగొట్టేందుకు మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ ఏడాది నవంబర్ 12, 2023 నాడు దీపావళి పండుగను జరుపుకోనున్నారు.
బలి పాడ్యమి/గోవర్ధన పూజ.. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే. దాంతో ఈ రోజు అప్పటి నుంచి ఐదు రోజులు జరుపుకునే పండుగలో గోవర్ధన పూజ ఒక భాగంగా మారింది. ఈ పండుగను ఈ ఏడాది నవంబర్ 13, 2023 రోజు జరుపుకోనున్నారు. ఆ తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈరోజు మహిళలు ఉపవాసం ఉండి నాగపూజను ఆచరిస్తారు.
భగిని హస్త భోజనం.. ఇక చివరగా అన్నాచెల్లెళ్ల పండగను జరుపుకుంటారు. దీనినే భగిని హస్త భోజనం, యమ ద్వితీయ, భాయిదూజ్‌గా కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో కృష్ణుడు ఈ రోజు నాడు నరకాసురుడిని ఓడించిన తర్వాత తన సోదరి సుభద్రను కలవడానికి వెళ్లాడు. అలాగే సత్యయుగంలో యమ ధర్మరాజు ఈ రోజున తన సోదరి యమున ఆహ్వానంపై ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు యమునా దేవి తన అన్నకు కుంకుమ దిద్ది ఇష్టమైన ఆహారం కొసరి కొసరి వడ్డించింది. అప్పటి నుంచి ఈ రోజును అన్నా చెల్లెల పండగగా జరుపుకుంటారు. ఈ పర్వదినం సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఆదర్శంగా నిలుస్తోంది. అన్నాచెల్లెళ్ల పండగ ఈ ఏడాది నవంబర్ 14 న జరుపుకోనున్నారు.