Divorce Dispute On African Grey Parrot : వివాహానికి ముందు కానుకగా ఇచ్చిన ఆఫ్రికన్ గ్రే చిలుకను తిరిగి ఇస్తేనే విడాకులు ఇస్తానని తన భార్యను డిమాండ్ చేశాడు ఓ వ్యక్తి. దాదాపు మూడేళ్లుగా ఫ్యామిలీ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసు ఎట్టకేలకు అతడి భార్య అంగీకరించడం వల్ల సద్దుమణిగింది. ఆశ్చర్యకరంగా ఉన్న ఈ అరుదైన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే?
పుణెకు చెందిన ఓ జంట 2019లో వివాహం చేసుకున్నారు. అయితే వివాహం అయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆ దంపతులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పుణెలోని ఫ్యామిలీ కోర్టులో భార్యాభర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ఆ దంపతులు ఇద్దరికీ ఫ్యామిలీ కోర్టులో కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటీకీ ఆ ఇద్దరూ విడాకులు తీసుకునేందుకే సిద్ధమయ్యారు.
అయితే విడాకులు ఇచ్చేందుకు తన భార్యకు ఓ కండీషన్ పెట్టాడు ఆమె భర్త. ' నేను నీకు ఇచ్చిన ఆఫ్రికన్ చిలుకను తిరిగి ఇస్తేనే విడాకులు ఇస్తాను' అని అతడి భార్యను డిమాండ్ చేశాడు. అయితే తొలుత ఆమె చిలుకను ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విధంగా ఫ్యామిలీ కోర్టులో మూడేళ్లుగా ఈ భార్యాభర్తల విడాకుల కేసు కొనసాగింది. ఎట్టకేలకు తన భర్తకు ఆఫ్రికన్ చిలుకను ఇచ్చేందుకు అతడి భార్య అంగీకరించింది. దీంతో దంపతులు విడాకులు తీసుకున్నారు.
నల్లగా ఉందని భార్యకు విడాకులు!
ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా ఛత్తీస్గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శరీరం రంగు విషయంలో భర్త తన భార్యను తక్కువగా చూసిన విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. చర్మం రంగు ఆధారంగా జీవిత భాగస్వామిని విడిచిపెట్టే స్వేచ్ఛ ఎవరికీ లేదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఇదీ జరిగింది
బిలాస్పుర్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకుల తీసుకోవడం కోసం న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం న్యాయస్థానంలో విచారణ సందర్భంగా అతడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇంటికి రమ్మని కోరినా తన భార్య రావట్లేదని ఈ సందర్భంగా ఆ మహిళ భర్త కోర్టుకు తెలిపాడు.
అయితే తన శరీర రంగు గురించి భర్త పలుమార్లు నానా మాటలు అనేవాడని అతడి భార్య కోర్టుకు తెలిపింది. తన చర్మం నల్లగా ఉండడం వల్ల మరో మహిళను వివాహం చేసుకుంటానని తరచూ భర్త బెదిరిస్తున్నాడని ఆమె కోర్టుకు వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మహిళ భర్త పిటిషన్ను తిరస్కరించింది. చర్మం రంగు ఆధారంగా వివక్షను తొలగించడానికి సామాజిక మార్పు అవసరమని తెలిపింది. ఈ సందర్భంగా ఫెయిర్నెస్ క్రీమ్ పరిశ్రమలపై అసహనం వ్యక్తం చేసింది.