పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెగాసస్, నూతన వ్యవసాయ చట్టాలు, కరోనా సెకండ్ వేవ్ తదితర అంశాలపై అధికార, విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతో లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో ఈ సెషన్‌లో ఇప్పటివరకు దాదాపు రూ.130 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షాలు పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు దేశంలోని పలువురు విపక్ష నేతలు, జడ్జిలు, సామాజిక కార్యకర్తలతో పాటు కొందరు మంత్రుల ఫోన్లను సైతం పెగాసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుండటం వల్ల విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను ముందుకు సాగనీయడంలేదు. దీంతో కొన్ని రోజులుగా వాయిదాల పరంపరే కొనసాగుతోంది. ఇప్పటివరకు 54 గంటల పాటు పనిచేయాల్సిన లోక్‌సభ ఈ ప్రతిష్టంభనలతో కేవలం ఏడు గంటలే పనిచేసిందని, అలాగే, 53 గంటలకు గాను రాజ్యసభ 11 గంటలు మాత్రమే పనిచేసినట్టు ఓ అధికారి పేర్కొన్నట్టు సమాచారం.
మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకు జరిగిన పనిదినాల్లో ఉభయసభలూ 107 గంటల పాటు పనిచేయాల్సి ఉండగా.. కేవలం 18 గంటలే కార్యకలాపాలు కొనసాగినట్టు సదరు అధికారి పేర్కొన్నారు. దీంతో 89 గంటల సమయం వృథా అయిందని తెలిపారు. తద్వారా మొత్తంగా చూస్తే దేశ ప్రజల సొమ్ము దాదాపు రూ.133 కోట్ల కంటే ఎక్కువగా వృథా అయిందని వెల్లడించారు.
ఇదీ చూడండి : జీఎస్టీ చెల్లించొద్దని వ్యాపారులకు 'మోదీ' సలహా!