టూల్‌కిట్ వివాదం నేపథ్యంలో అరెస్టయిన పర్యావరణ కార్యకర్త దిశా రవి గురువారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పోలీసులు... మీడియాకు బహిర్గతం చేయకుండా చూడాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి సంబంధించి విచారణ త్వరగా జరపాలని దిశా తరఫు నాయవ్యాది అభినవ్ సేక్రి కోర్టును అభ్యర్థించారు. మీడియా కూడా దిశా రవి వ్యక్తిగత వాట్సాప్ చాట్‌ను బహిర్గతం చేయకూడదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదీ జరిగింది...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలుగా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా నిలిచారు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్విట్టర్లో ఓ టూల్ కిట్‌ను పోస్టు చేశారు.
గ్రెటా షేర్ చేసిన టూల్ కిట్ రూపకల్పన, వ్యాప్తిలో దిశ కీలక కుట్రదారని పోలీసులు అంటున్నారు. అందుకోసం వాట్సాప్‌లో ఆమె ఓ గ్రూప్ నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగస్వాములైన మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో వారు భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల 'పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్' సంస్థతో చేతులు కలిపారని వివరించారు. దిశనే గ్రెటాకు ఈ టూల్ కిట్ షేర్ చేశారని పోలీసులు తెలిపారు.
దిశపై దేశ ద్రోహం సహా కుట్ర, విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి పలు అభియోగాలతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా మరికొన్ని అరెస్టులు జరుగుతాయని దిల్లీ పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి:'టూల్‌కిట్' అరెస్టులపై రాజకీయ రగడ