వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందన్నారు భారత సైన్యాధిపతి ఎంఎం నరవాణె. ఈ విషయంలో ఇరువైపులా ప్రయోజనకరంగా ఉందన్నారు. పాంగాంగ్లోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ.. ప్రతిష్టంభనకు మంచి ముగింపును ఇచ్చిందన్నారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో అనిశ్చితిపై ఆయన మాట్లాడారు.
మొదటినుంచీ వ్యూహాత్మకంగానే..
లద్దాఖ్ ప్రతిష్టంభన సమయంలో భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిదన్నారు నరవాణె. దేశ అంతర్గత భద్రత విషయంలోనూ అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ప్రతిష్టంభనను తొలగించడానికి భారత్ సమష్టి కృషి చేసిందన్నారు నరవాణె. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు.
"ప్రతిష్టంభనను తొలగించడానికి సమష్టి కృషి చేశాం. ఓ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాం. దాని ఫలితాలు ఎలా ఉన్నా, ఏం జరిగినా. అయితే గొప్ప విజయాన్నే సాధించాం. ఇది మంచి పరిణామమే అని భావిస్తున్నా. ఇరుదేశాలు ఏదో సాధించాయన్న భావనలో ఉన్నాయి."
- ఎంఎం నరవాణె, సైన్యాధ్యక్షుడు
ఈ విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్.. ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయన్నారు నరవాణె. వ్యూహాత్మక వ్యవహారాలపై డోభాల్ దూర దృష్టి.. ప్రతిష్టంభన తగ్గించడంలో తోడ్పడిందన్నారు.
ఇదీ చూడండి: వ్యాపారం ప్రభుత్వ విధి కాదు: మోదీ