ఆన్లైన్ గేమ్స్ మాయలో పడిన ఓ యువకుడు.. మతిస్తిమితం కోల్పోయి ఏకంగా సొంత బామ్మనే హతమార్చాడు. అంతటితో ఆగని నిందితుడు.. తాను దేవుడినని, ఆయనే తనతో ఈ పని చేయించాడని చెప్పాడు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఎవరైనా అడ్డొస్తే వారికీ ఇదే గతిపడుతుందని హెచ్చరించాడు. కేరళలో ఈ దారుణ ఘటన జరిగింది.
మొబైల్ మాయలో..
కల్లాకురిచీ జిల్లాకు చెందిన మన్నాన్కట్టి కుమారుడు హరిహరన్ (21).. దిండిగల్ జిల్లా గాంధీనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో బీఎస్సీ అగ్రికల్చర్(మూడో సంవత్సరం) చదువుతున్నాడు. లాక్డౌన్ కారణంగా కళాశాల మూతపడటం వల్ల.. ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు హరిహరన్. ఈ క్రమంలోనే చరవాణికి అలవాటు పడిన అతడు.. రాత్రి, పగలూ తేడా లేకుండా ఆన్లైన్ గేమ్స్‌కు అంకితమైపోయాడు. తీవ్ర కుంగుబాటుకు లోనయ్యేవాడు. తల్లిదండ్రులు, సోదరి ఏదైనా చెబితే విసుక్కునేవాడు. కొడుకు ప్రవర్తనతో విసుగుచెందిన తండ్రి.. స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపించాడు. ప్రస్తుతం అతడి మానసిక స్థితి సరిగ్గాలేదని, చికిత్స అవసరమని డాక్టర్ సూచించాడు. కొంతకాలం చికిత్స పొందాక అతడు తిరిగి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉంటే తన కొడుకు ఇలాగే చికాకు పడుతూ ఉంటాడని భావించి.. అతణ్ని వేరే చోటుకు మార్చాలనుకున్నాడు.
'దేవుడు చెప్పాడు.. చేశాను'
ఆ ఆలోచనతో హరిహరన్ను ఉలుందుర్పేట్లోని ఎల్లైగ్రామంలో వాళ్ల బామ్మ(80) వద్ద వదిలేసి వెళ్లాడు. అక్కడికెళ్లాక క్రమంగా మాత్రలు వాడటం మానేశాడు హరిహరన్. ఫలితంగా అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో మరింత నిరాశ నిస్పృహలకు లోనైన అతడు.. బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా లేచి, బామ్మపై దాడి చేశాడు. ఆమె తల, ఛాతీభాగంపై బండరాయితో మోదాడు. దీంతో బాధితురాలు గావు కేకలు పెట్టింది. స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. "నేను దేవుణ్ని. ఆయనే బామ్మను చంపేయమని చెప్పాడు. ఎవరూ అడ్డురాకండి. కాదని దగ్గరికొస్తే వాళ్లకూ ఇదే గతి పడుతుంది." అని తీవ్రంగా హెచ్చరించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ని అరెస్ట్ చేశారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ ఊరిలో రెండో అంతస్తు కట్టాలంటే వణుకు!