ఉత్తర్‌ప్రదేశ్ దేవరియా జిల్లాలోని సావరేజీ ఖరగ్ గ్రామంలో వంతెనకు బాలిక మృతదేహం వేలాడిన ఘటన కలకలం సృష్టించింది. జీన్స్, టీషర్ట్స్ ధరిస్తుందనే కారణంతో సొంత బాబాయ్, తాత కలిసి చంపేశారు. నదిలో విసిరేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.
ఇదీ జరిగింది..
పంజాబ్‌లోని లుధియానాలో 11వ తరగతి చదువుకుంటోంది 16 ఏళ్ల నేహ. తండ్రి ఉపాధి నిమిత్తం లుధియానాకు వలస వెళ్లాడు. అక్కడే నివసిస్తున్న బాలిక.. కొన్ని రోజుల క్రితం తల్లితో కలిసి తమ సొంతూరు యూపీలోని దేవరియా జిల్లా సావరేజీ ఖరగ్కు వచ్చింది. తనకు జీన్స్, టీషర్ట్ వేసుకోవటం అలవాటు. సొంతూరులో కూడా తను అలాగే దుస్తులు ధరించేది. అది వారి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నేహ తాత పరమహంస, బాబాయ్ అరవింద్.. అలాంటి బట్టలు వేసుకోవద్దని ఆమెను వారించేవారు. గ్రామంలో ఉన్నప్పుడు సాల్వర్ ధరించాలని ఒత్తిడి చేసేవారు. గత కొన్ని రోజులుగా ఈ విషయమై ఇంట్లో బాలికకు వేధింపులు కొనసాగుతున్నాయి. గత మంగళవారం (జులై 20).. ఈ విషయంపై గొడవకు దిగారు. తీవ్రంగా చితకబాదారు. వారిని అడ్డుకునేందుకు బాలిక తల్లి శాకుంతల దేవి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నేహను ఆమె బాబాయ్ అరవింద్ విచక్షణారహితంగా కొట్టి బలంగా నెట్టటం వల్ల వెనకాల గోడకు తల తగిలింది. తీవ్ర రక్తస్రావంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఇదంతా చూసిన బాలిక తల్లి శాకుంతల దేవి పెద్దగా అరిచింది. చుట్టుపక్కలవారు మద్దతు ఇస్తారని ఆశించింది. ఈ క్రమంలోనే బాలికకు చికిత్స అందిస్తామని బొంకి అర్ధరాత్రి ఓ టెంపో మాట్లాడుకుని.. నిందితులు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు నాటకమాడారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లి.. గ్రామం సమీపంలోని పటన్వా వంతెన పైనుంచి నదిలోకి విసిరేశారు. కానీ, ఆమె మృతదేహం వంతెన రెయిలింగ్‌లో చిక్కుకుంది. ఉదయం అటుగా వెళ్లిన కొందరు వంతెనకు వేలాడుతున్న బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బాధిత బాలిక తల్లి శాకుంతల దేవీ మహువాడిహ్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేసింది. జీన్స్, టీషర్ట్స్ వేసుకున్నందుకే.. బాలిక బాబాయ్, తాత.. తీవ్రంగా కొట్టి హత్యా చేశారని ఆరోపించింది.
కేసు నమోదు చేసిన పోలీసులు.. నేహ తాత పరమహంస, బాబాయ్ అరవింద్‌లతో పాటు టెంపో డ్రైవర్ హసనైన్ను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:కట్నం తేనందని భార్యతో యాసిడ్ తాగించిన భర్త!