Jharkhand Ropeway Collide: ఝార్ఖండ్‌లో పెనుప్రమాదం జరిగింది. డియోఘర్‌లోని తిక్రూట్ పర్వతాల వద్ద ఉన్న రోప్‌వేలో పలు కేబుల్ కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఓ మహిళ మృతి చెందగా.. సుమారు పదిమంది పర్యటకులు క్షతగాత్రులయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం శ్రీరామనవమి పురస్కరించుకుని అధిక సంఖ్యలో పర్యటకులు ఆ ప్రాంతానికి వెళ్లారు. 'ఆకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న కేబుల్ కారు.. మేము ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అదే సమయంలో రోప్‌వేలో వెళ్తున్న మిగతా కార్లు పరస్పరం ఢీకొన్నాయి' అని గాయపడిన పర్యటకులు చెప్పారు.
ఈ ఘటన జరిగిన సమయంలో రోప్వేకు సంబంధించిన 19 కేబుల్ కార్లలో 70 మంది పర్యటకులు చిక్కుకుపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎన్ఢీఆర్ఎఫ్ సిబ్బంది దిగి సహాయక చర్యలు చేపట్టారు. రోప్‌వేలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఎంఐ-17 హిలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టింది. కొందరిని కేబుల్ కార్లలో నుంచి బయటకు తీశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి సంబంధించి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం డియోఘర్‌లోని సదర్ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కేంద్ర మంత్రికి ధరల సెగ- విమానంలోనే వాడీవేడిగా..!