Democracy summit 2021: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్విస్తున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రజాస్వామ్య స్ఫూర్తి మన నాగరికతలో అంతర్భాగం. కొన్ని శతాబ్దాల పాటు సాగిన వలస పాలన.. భారత ప్రజల్లోని ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేకపోయింది. భారత స్వాతంత్ర్యం గత 75 సంవత్సరాలుగా బలమైన ప్రజాస్వామ్య దేశ నిర్మాణానికి దారి తీసింది. అది అన్ని రంగాల్లో సామాజిక- ఆర్థిక ప్రగతి సాధనకు, స్థిరమైన అభివృద్ధికి నిదర్శనం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల కోసం ఏర్పాటైంది కాదు.. ప్రజలతో, ప్రజలలో మమేకమై ఉంటుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించటంలో భారత్.. తన నైపుణ్యాన్ని పంచుకోవటం సంతోషంగా ఉందని తెలిపారు మోదీ. ప్రపంచానికి కీలక అంశాలను అందించినట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాలు, క్రిప్టోకరెన్సీ వంటి ఆధునిక సాంకేతికతల కోసం అంతర్జాతీయ నిబంధనలు రూపొందించాలని పిలుపునిచ్చారు మోదీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అవి ఉపయోగపడేలా తప్ప.. అణచివేసేందుకు వినియోగించకూడదని సూచించారు.
ఇదీ చూడండి: భారత్‌ను విస్మరించిన అమెరికా- రష్యానే కారణం!