దేశంలో కరోనా రెండో దశ విజృంభణకు కారణమైన డెల్టా వేరియంట్ గురించి కీలక విషయాలు వెల్లడించారు సార్స్ కొవ్-2 జీనోమ్ కన్సార్టియమ్ అధిపతి డాక్టర్ ఎన్కే. అరోడా. దేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80శాతానికిపైగా కేసులకు ఈ వేరియంటే కారణమవుతోందని చెప్పారు. అంతకుముందు ఉన్న అల్ఫా వేరియంట్ కన్నా డెల్టా వేరియంట్.. 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని వివరించారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సింగపూర్ సహా 80 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించిందని పేర్కొన్నారు.
"బి.1.617.2 వేరియంట్(డెల్టా వేరియంట్)ను గతేడాది అక్టోబర్‌లో తొలిసారి గుర్తించారు. దేశంలో రెండో దశ కరోనా విజృంభణకు ఈ వేరియంట్ వ్యాప్తే కారణంగా మారింది. ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో 80 శాతం కేసులకు ఈ వేరియంటే కారణం. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్ ఉత్పరివర్తనాలు.. కణాల ఉపరితలంతో ఉండే ఏసీఈ2 గ్రాహకాలతో తొందరగా కలిసిపోతోంది. తద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకుంటోంది."
- ఎన్కే అరోడా, సార్స్ కొవ్-2 జీనోమ్ కన్సార్టియమ్ అధిపతి
అయితే.. డెల్టా వేరియంట్ కారణంగా వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పడం కష్టమని ఎన్కే అరోడా పేర్కొన్నారు. వయసులవారీ కరోనా మరణాలు.. ఒకటో దశలో ఉన్నట్లుగానే రెండో దశలోనూ ఉన్నాయని చెప్పారు. డెల్టా ప్లస్ వేరియంట్లోని ఏవై.1, ఏవై.2 రకాలు.. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో 55 నుంచి 60 కేసులు వెలుగు చూశాయని అరోడా వివరించారు. నేపాల్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్ వంటి దేశాల్లోనూ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్‌పై అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
టీకాల మాటేమిటి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు.. డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కోగలవని డాక్టర్ ఎన్కే అరోడా స్పష్టం చేశారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతోందని చెప్పారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతోందన్నారు. మరిన్ని వేరియంట్లు వ్యాపిస్తే.. దేశంలో కరోనా కేసులు పెరగవచ్చని.. అది తరువాతి దశ ఉద్ధృతికి దారితీయవచ్చని హెచ్చరించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించి, వ్యాక్సిన్ తీసుకుంటేనే భవిష్యత్‌లో వచ్చే కరోనా వేవ్‌లను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
శ్రీలంకలోనూ డెల్టా కలకలం
శ్రీలంకలోనూ కరోనా డెల్టా వేరియంట్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో 30 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: Corona Vaccine : రెండు డోసుల టీకాతో కరోనా నుంచి రక్షణ
ఇదీ చూడండి: ఆ దేశంలో వయోజనులందరికి వ్యాక్సిన్ పూర్తి!