దిల్లీలో కురిసిన వర్షాలకు (Delhi rain) ఏళ్ల నాటి రికార్డులు బద్దలయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి శనివారం వరకు 380.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 77 ఏళ్లలో సెప్టెంబర్ నెలలో ఇంతటి భారీ వర్షాలు ఎన్నడూ (Delhi september rain) కురవలేదని భారత వాతావరణ శాఖ (IMD) సఫ్దర్‌గంజ్ అబ్జర్వేటరీ తెలిపింది. 1944 తర్వాత ఈ స్థాయిలో వర్షం కురవడం (Delhi rainfall record) ఇదే తొలిసారి కాగా... 121 ఏళ్లలో ఇది రెండో అత్యధికం.
సెప్టెంబర్ నెలలో అత్యధిక వర్షపాతం రికార్డులు
- 1944: 417.3 మి.మీ
- 2021: 380.2 మి.మీ
- 1914: 360.9 మి.మీ
- 1945: 359.2 మి.మీ
- 1933: 341.9 మి.మీ
ఈ సీజన్లో మొత్తంగా 1,136.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని సఫ్దర్‌గంజ్ అబ్జర్వేటరీ (Safdarjung Observatory) తెలిపింది. 1933లో 1,420.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. నెలవారీగా చూస్తే.. జూన్‌లో 34.8, జులైలో 507.3, ఆగస్టులో 214.5, సెప్టెంబర్‌లో 380.2 మి.మీ వర్షం కురిసిందని వివరించింది.
"సెప్టెంబర్ 11 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని 1901 నుంచి డేటాతో పోల్చి చూశాం. 2021 ఏడాది రికార్డులను బద్దలు కొట్టింది. 1050 మి.మీటర్లకు పైగా వర్షపాతాన్ని నమోదు చేసిన సీజన్లను దాటేసింది."
-ఐఎండీ
మరోవైపు, రాజధానికి భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. సెప్టెంబర్ 17-18 నుంచి మరో విడత వర్షాలు దిల్లీ, పరిసర ప్రాంతాలను ముంచెత్తుతాయని తెలిపింది. శనివారం సైతం పలు ప్రాంతాల్లో వాన పడింది. లోతట్టు ప్రదేశాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరుకోవడం వల్ల ట్రాఫిక్‌తో పాటు పాదాచారులకు ఇబ్బందులు కలిగాయి.
ఇదీ చదవండి: Coronavirus: స్కూల్ పిల్లలకు పాఠ్యాంశంగా కరోనా!