భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమర జవాన్లకు నివాళులర్పించారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అంజలి ఘటించారు. యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించారు. ఈ అఖండ జ్యోతులను 1971 యుద్ధం పరమ్‌వీర్ చక్ర, మహావీర్ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.
1971లో తూర్పు పాకిస్థాన్‌లో స్వతంత్ర పోరు మొదలై భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఇందులో పాక్‌ను భారత్ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు. బుధవారం.. యుద్ధ స్మారకం వద్ద నిర్వహించిన వేడుకల్లో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ ఏడాదితో భారత్ విజయానికి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'స్వర్ణ విజయ సంవత్సరం'గా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రముఖుల నివాళులు..
విజయ్ దివస్‌ను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు అమరవీరులకు సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు.
- దేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని రక్షించడంలో మన జవాన్లు చూపే అచంచలమైన నిబద్ధత, సైనికుల శౌర్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం. 1971 యుద్ధంలో ప్రతి సైనికుడు పరాక్రమాన్ని ప్రదర్శించాడు. దేశం కోసం ఎంతోమంది జవాన్లు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలకు యావత్ భారతావని శాశ్వతంగా రుణపడి ఉంటుంది. - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
- విజయ్ దివస్ సందర్భంగా 1971 యుద్ధ వీరులకు ఘన నివాళులర్పిస్తున్నా. వారి శౌర్యపరాక్రమాలతో భారత చరిత్రలో సువర్ణ అధ్యయాన్ని లిఖించారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- భారత ఆర్మీ ధైర్యం, పరాక్రమాలకు సెల్యూట్. 1971 యుద్ధ విజయంతో మన వీర జవాన్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వారి త్యాగాలు యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకం. ప్రతి పౌరుడి గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారు. - కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్