దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల చర్యలే పోలీసులు బాష్పవాయు, జల ఫిరంగులు ప్రయోగించేలా చేశాయని పార్లమెంటుకు నివేదించింది కేంద్రం. పోలీసులకు అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని సభకు తెలిపింది. ఆందోళన చేస్తోన్న రైతులపై పోలీసులు చేసిన దాడి గురించి రాజ్యసభలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
'అల్లరి మూకను ప్రయోగించారు'
ట్రాక్టర్ ర్యాలీతో ఆందోళన చేస్తోన్న రైతులు బలవంతంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని దిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారని కిషన్‌రెడ్డి సభకు తెలిపారు. రైతులు దూకుడుగా వ్యవహరించి అల్లర్లకు పాల్పడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడానికి అల్లరి మూకలను ప్రయోగించారని.. దాని వల్ల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు కిషన్‌రెడ్డి వివరించారు.
'కరోనా నిబంధనలు పాటించడం లేదు'
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిరసనకారులు ఎవరూ భౌతిక దూరం పాటించడం లేదని, భారీ సంఖ్యలో గుమికూడటంతో పాటు.. కనీసం మాస్క్ కూడా ధరించడం లేదని సభకు తెలియజేశారు. గుంపులుగా ఉన్న వారిని నియంత్రించడానికి దిల్లీ పోలీసులు బాష్పవాయు గోళాలు, జలఫిరంగులు, ప్రయోగించక తప్పలేదని మంత్రి వివరించారు.
అవి రాష్ట్ర పరిధిలో అంశాలు..
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం శాంతి భద్రతల నిర్వహణ, పోలీసుల అంశం, కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ, నిందితులకు శిక్షలు, ప్రజల ప్రాణాలు-ఆస్తుల రక్షణ వంటి అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయని.. మరో ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.
క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలకు కమిటీ
క్రిమినల్ చట్టాల్లో సంస్కరణలకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, బార్ కౌన్సిల్ల నుంచి సూచనలు సేకరిస్తుందని తెలిపారు. దిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిచ్చారు. "అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, బార్ కౌన్సిల్లు, విశ్వవిద్యాలయాలు, న్యాయ సంస్థల నుంచి క్రిమినల్ చట్టాల్లో మార్పుల కోసం సూచనలు తీసుకుంటాం. వాటి ద్వారా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హోంశాఖ సంస్కరణలను పరిశీలిస్తుంది." అని ఆయన తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి
2019లో దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుపై దాడులు పెరిగాయని కేంద్రం తెలిపింది. ఎస్సీలపై 7.3 శాతం, ఎస్టీలపై 26.5శాతం పెరిగినట్లు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు కిషన్ రెడ్డి.
ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌లో మళ్లీ చేరేందుకు సిద్ధంగా ఉన్నా'