పార్లమెంట్లు ప్రతిష్టంభనపై విపక్షనేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలతో హోరెత్తించారు.
దేశంలోని 60 శాతం ప్రజలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగలేదనే అనుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశంలోని 60 శాతం మంది గళాన్ని అణచివేశారని ధ్వజమెత్తారు.
"ఈరోజు మేం బయటకు వచ్చి మీ(మీడియా)తో మాట్లాడుతున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిపోయాయి. దేశంలోని 60 శాతం మంది ప్రజలు పార్లమెంట్ సమావేశాలు లేవనే అనుకున్నారు. దేశంలోని 60 శాతం మంది ప్రజల గళాన్ని అణచివేశారు. ఇది ప్రజాస్వామ్య హత్య."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
'పాక్ బోర్డర్లో ఉన్నట్టు అనిపించింది'
విపక్షాల అభిప్రాయాలను వెల్లడించే అవకాశాన్ని సభలో తమకు ఇవ్వలేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బుధవారం మహిళా ఎంపీల పట్ల వ్యవహరించిన తీరు.. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. పాకిస్థాన్ బోర్డర్లో నిల్చున్న అనుభూతి కలిగిందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: దేశంలో 5వేల మంది కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్!