Delhi Liquor Scam Case Updates: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని అరుణ్ రామచంద్ర పిళ్లై తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన దిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామినని పిళ్లై ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని.. ఈ కేసులో తన పాత్రపై విచారణకు పూర్తిగా సహకరిస్తానని అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 13 వరకు అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉండనున్నారు. ఈ మేరకు అతని పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. వారి వాంగ్మూలం, సేకరించిన వివరాలు, తమ దర్యాప్తులో తేలిన ఆధారాల మేరకు కవితను విచారించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు నోటీసులు జారీ చేశారు. మార్చి 9న ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చి.. విచారణకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు సూచించారు. దీనిపై కవిత ఈడీకి లేఖ రాసినట్లు సమాచారం. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా మరోరోజు విచారణకు హాజరవుతానని ఆమె ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ 11న సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఇంటి వద్దే విచారించారు. దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన అధికారులు పలు కీలక విషయాలను రాబట్టారు.
అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు: మరోవైపు అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక విషయాలను ప్రస్తావించింది. 17 పేజీలతో పిళ్లై రిమాండ్ రిపోర్టు రూపొందించింది. దిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు లబ్ధి కలిగించేందుకు అన్నీ తానై అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ మొత్తాన్ని పిళ్లై దగ్గరుండి నడిపించారని వివరించింది. సౌత్ గ్రూపులో కవిత ఉన్నారని వెల్లడించింది. సౌత్ గ్రూపులో అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి సహా... వైసీపీ ఎంపీ మాగుంట, కుమారుడు రాఘవ్ ఉన్నారని చెప్పింది. సౌత్ గ్రూపు ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
మాజీ ఆడిటర్‌కు బెయిల్ మంజూరు.. మళ్లీ కస్టడీలోకి: ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును గత వారంలోనే ఈడీ అరెస్ట్ చేసింది. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. బుచ్చిబాబు ఇచ్చే సమాచారం చాలా కీలకంగా మారనుందని భావించి.. జ్యుడీషియల్ కస్టడీకి కోరుతూ ఈడీ.. సీబీఐ కోర్టును కోరింది. అందుకు అంగీకరించిన కోర్టు.. 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఇవీ చదవండి: Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత లబ్ధి కోసమే ఇదంతా: ఈడీ
ఈ పోరాటం ఆగదు.. వెనకడుగు వేసేదేలే: ఎమ్మెల్సీ కవిత
'ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై దాడులు బాధాకరం'.. ఆ దేశ ప్రధానితో మోదీ