Delhi High Court On Upsc Mains Exam : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే 2023 సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు అప్లికేషన్ల స్వీకరణపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు.. గురువారం తిరస్కరించింది. 2023 జులై 10న యూపీఎస్సీ జారీ చేసిన అప్లికేషన్ స్వీకరణపై స్టే విధించాలని పలువురు సివిల్స్ ఆశావాహులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ చంద్ర ధారి సింగ్ స్టే విధించడానికి నిరాకరించారు.
2023 ప్రారంభంలో జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని కొందరు అభ్యర్థులు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్సర్ కీ ఇవ్వాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది.. సివిల్స్ మెయిన్స్ పరీక్షల కోసం అప్లికేషన్ల స్వీకరణపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. లేదంటే ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనివారి పిటిషన్ నిరూపయోగమైపోతుందని అన్నారు. యూపీఎస్ఎసీ ఏకపక్ష నిర్ణయం వల్ల చాలా మంది సివిల్స్ ఆశావాహులు బాధపడ్డారని అన్నారు. అయితే.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు.
సివిల్స్‌లో సత్తా చాటిన అమ్మాయిలు..
UPSC Civils Toppers : ఇటీవలే విడుదలైన సివిల్స్-2022 తుది ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా టాప్ ర్యాంకర్లుగా అమ్మాయిలే సత్తా చాటారు. తొలి నాలుగు ర్యాంకులను వారే సాధించారు. ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించగా.. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్, స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు.
Ishita Kishore UPSC Topper : సివిల్స్ తుది ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన ఇషితా కిశోర్.. ఉత్తర్‌ప్రదేశ్ వాసి. గ్రేటర్ నొయిడాలోని బాల్ భారతి స్కూల్లో చదివిన ఇషిత.. 2017లో దిల్లీలోని శ్రీరామ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత లండన్‌లోని ఎర్నెస్ట్ అండ్ గ్లోబల్ లిమిటెడ్ అనే ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలో రిస్క్ అడ్వైజర్‌గా పనిచేశారు. సివిల్ సర్వీసెస్ మీద ఆసక్తితో యూపీఎస్సీ పరీక్షలపై దృష్టి సారించారు. తొలి ప్రయత్నంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలోనే ఉత్తీర్ణత సాధించలేదు. ఇతర ర్యాంకర్ల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.