విద్య, వైద్యమే ప్రధాన ఎజెండా అని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. రూ.69వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన దిల్లీ ప్రభుత్వం, మొత్తం బడ్జెట్‌లో 25శాతం విద్యకే కేటాయించింది. గడిచిన ఆరు సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.16వేల కోట్లను(25శాతం) ఖర్చు చేయనుంది. రెండో ప్రాధాన్యతగా ఆరోగ్య రంగానికి దాదాపు పదివేల కోట్లను కేటాయించింది.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 69వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా విద్యకు రూ.16,377 కోట్లను కేటాయించగా, వైద్యరంగానికి రూ.9934 కోట్లను కేటాయించారు. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ప్రాధాన్యత రంగమైన ఆరోగ్య సంరక్షణకు కూడా భారీగా నిధులు కేటాయించామన్నారు. కొవిడ్ విజృంభణ వేళ, ప్రభుత్వ కేంద్రాలలో టీకా తీసుకునే వారికి ఉచితంగానే టీకా అందిస్తామని దిల్లీ ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ.50కోట్లను ఖర్చు చేస్తామని తెలిపారు.
ఈసారి ‘దేశభక్తి’ అనే నినాదంతో కొత్త బడ్జెట్‌ను రూపకల్పన చేశామని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. విద్యార్థుల్లో జాతీయభావాన్ని పెంపొందించడం కోసం ఈసారి కొత్త సెలబస్‌ను తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఓ గంటపాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాల కోసమే కేటాయిస్తామని స్పష్టంచేశారు. మహిళలను గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడటం, సమానత్వం, సోదరభావం వంటి అంశాల్లో దిల్లీ పాఠశాలల పిల్లల్లో దేశభక్తిని చూడాలని అనుకుంటున్నట్లు మనీశ్ సిసోడియా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల శిక్షణ కోసం ప్రత్యేకంగా 'టీచర్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీచర్లు ఇక్కడ నుంచి శిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఎన్నికల ముందు బంగాల్ డీజీపీ బదిలీ