Delhi Gas Leak School Students Fainted : స్కూల్ సమీపంలో గ్యాస్ లీకై.. దాదాపు 24 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. దిల్లీలోని నరైనా ప్రాంతంలో ఉన్న ఎంసీడీ స్కూల్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధిత విద్యార్థులంతా రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు దిల్లీ అధికారులు.
బాధిత విద్యార్థుల్లో 19 మందిని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని ఆచార్య శ్రీ భిక్షు హాస్పిటల్లో చేర్పించినట్లు వివరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతానికి విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
ఘటనకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం తమకు పీసీఆర్ కాల్ అందిందని దిల్లీ పోలీసులు తెలిపారు. ఇంద్రపురిలోని నిగమ్ ప్రతిభ విద్యాలయానికి చెందిన కొంతమంది విద్యార్థులు.. స్పృహతప్పి పడిపోయినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని వారందరినీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పాఠశాలలోని కొన్ని తరగతి గదుల్లో విపరీతమైన దుర్వాసన వచ్చినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు. అంతకు ముందే తాము భోజనం చేసినట్లు వారు వెల్లడించారు.
కాగా రైల్వే ట్రాక్ దగ్గర్లో గ్యాస్ లీక్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్యాస్ ఎందుకు వెలువడుతోందన్న దానిపై వారు విచారణ చేస్తున్నారు. విద్యార్థుల పరిస్థితిపై ఆరోగ్య, విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా బాధిత విద్యార్థులను ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెడికల్ కాలేజ్లో అగ్నిప్రమాదం..
Fire Breaks Out in Delhi Medical College : దిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్లో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఉన్న అనాటమీ డిపార్ట్మెంట్లో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందినట్లు వారు వెల్లడించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది.. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని కలగలేదు.
'4 నెలలుగా మణిపుర్ తగలబడుతుంటే.. పార్లమెంట్లో మోదీ జోకులా?'
Parliament Sine Die Today : ఆన్లైన్ గేమింగ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం.. ఆప్ ఎంపీపై సస్పెన్షన్ వేటు