Delhi Excise Policy: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా నివాసాలు సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. మొత్తం 21 ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ-2022(నూతన మద్యం విధానం) నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టింది. ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చిన సమయంలో దిల్లీ ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న అరవ గోపీ కృష్ణ నివాసంలోనూ దర్యాప్తు సంస్థ తాజాగా తనిఖీలు నిర్వహిస్తోంది.
సీబీఐ దాడుల విషయాన్ని సిసోదియా ధ్రువీకరించారు. తన నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. విద్యా, వైద్య రంగంలో తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఆందోళన చెందుతున్నారంటూ పరోక్షంగా కేంద్రంపై ఆరోపణలు చేశారు. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలేనని, నిజాలన్నీ కోర్టులోనే బయటకు వస్తాయన్నారు. సీబీఐ దాడుల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశారు. 'సీబీఐకి స్వాగతం. మేం పూర్తి సహకారం అందిస్తాం. అంతకుముందు చాలా సార్లు సోదాలు చేశారు. ఏం దొరకలేదు. ఇప్పుడూ అంతే' అని అన్నారు. తాము చేస్తున్న మంచి పనులకు కేంద్రం ఇస్తున్న బహుమానం ఇదేనంటూ దుయ్యబట్టారు. ''ఈరోజే దిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను అభినందిస్తూ అమెరికా దిగ్గజ వార్తాపత్రిక అయిన న్యూయార్క్ టైమ్స్‌లో మొదటిపేజీలో కథనం వచ్చింది. మనీష్ సిసోదియా ఫొటోను కూడా ప్రచురించారు. ఇదే రోజు ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. మంచి పనికి లభించిన ఫలితమిది.'' అని ట్వీట్ చేశారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొద్దిరోజుల కింద సీబీఐకి సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో జరిగిన నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మద్యం విధానంపై చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన నివేదికను చూస్తే జీఎన్‌సీటీడీ యాక్ట్ 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్, దిల్లీ ఎక్సైజ్ యాక్ట్-2009తోపాటు దిల్లీ ఎక్సైజ్ రూల్స్-2010ల నియమాలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని దిల్లీ ఎల్‌జీ పేర్కొన్నారు. వీటితోపాటు టెండర్ల తర్వాత లైసెన్సుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం విధానపరమైన లోపాలకు పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.
ఎల్‌జీ సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గత నెలలో దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మద్యం విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పాత మధ్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు పేర్కొంది. అంతేగాక, ప్రభుత్వం నిర్వహించే దుకాణాల ద్వారానే మద్యాన్ని విక్రయించాని ఆదేశించారు.
ఇవీ చూడండి: 'మద్యం ధరలు భారీగా తగ్గించాం.. ఆదా చేసిన డబ్బుతో అవి కొనండి'.. ఎమ్మెల్యే టిప్స్!
పెట్రోల్‌పై సుంకం తగ్గించినా.. ఖజానాకు నష్టం తక్కువే!.. కొత్త పన్నుతో భర్తీ!