ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యులు (Hizbul Mujahideen new news) ఇద్దరికి దిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరికి 10 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జమ్ము కశ్మీర్ అఫెక్టర్స్ రిలీఫ్ ట్రస్ట్ కేసులో వీరికి శిక్ష పడిందని ఎన్ఐఏ వెల్లడించింది.
ఈ కేసులో మహమ్మద్ షఫి షా అలియాస్ దావుద్‌కు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించింది కోర్టు. తాలిబ్ లలీ అలియాస్ వసీమ్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, ముజాఫర్ అహ్మద్ దార్ నీ గాజ్నవికి 12 ఏళ్ల శిక్ష, రూ.15 వేల జరిమానా, ముష్తాక్ అహ్మద్ లోన్ అలియాస్ ముష్తాక్ ఆలంకు 10 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా వేసింది.
కేసు ఏంటంటే?
మహమ్మద్ యూసఫ్ షా అలియాస్ సయ్యద్ సలాహుద్దీన్ సహా పలువురు హిజ్బుల్ అనుచరులు భారత్‌లో ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఎన్ఐఏ 2011 అక్టోబర్ 25న కేసు నమోదు చేసింది. వీరికి పొరుగు దేశాల నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయని ఆరోపించింది. జమ్ము కశ్మీర్ అఫెక్టర్స్ రిలీఫ్ ట్రస్ట్ అనే ఎన్జీఓ ద్వారా వీరు నిధులు పొందుతున్నారని, వీటిని క్రియాశీల ఉగ్రవాదులకు, మరణించిన ముష్కరుల కుటుంబాలకు అందజేస్తున్నారని అభియోగాలు మోపింది.
దీనిపై దర్యాప్తు నిర్వహించిన ఎన్ఐఏ.. 12 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురికి శిక్ష పడింది. మిగిలిన ఎనిమిది మంది హిజ్బుల్ అనుచరులు.. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.
ఇదీ చదవండి: పెగసస్‌పై బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు!