జర్నలిస్టు ప్రియా రమణిపై.. కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను దిల్లీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ప్రియను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.
మహిళకు దశాబ్దాల తర్వాతైనా.. తన బాధను వ్యక్తపరచడానికి, ఫిర్యాదు చేసేందుకు హక్కు ఉందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. రామాయణ, మహాభారతాల్లోనూ మహిళలను గౌరవించాలని ఉందని, అలాంటి దేశంలో మహిళలపై ఇలాంటి నేరాలకు పాల్పడటం సిగ్గు చేటు అని కోర్టు మండిపడింది.
మీ టూ ఆరోపణలు..
20 ఏళ్ల క్రితం అక్బర్ జర్నలిస్టుగా ఉన్నప్పుడు.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 2018లో ప్రియా రమణి ఆరోపించారు. మీ టూ సమయంలో.. అక్బర్‌పై ఆరోపణలు చేసిన మొదటి మహిళ రమణినే కావడం గమనార్హం. ఈ కారణంగా.. ఆయన కేంద్ర మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
ప్రియ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో తాజాగా దిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది.