దిల్లీలో వాయు కాలుష్యానికి(Delhi Air Pollution) దుమ్ము, భారీ వాహనాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు వంటివే ప్రధాన కారకాలని సుప్రీంకోర్టు(Supreme Court On Delhi pollution) సోమవారం స్పష్టం చేసింది. తక్షణమే తగిన చర్యలు చేపడితే.. వాయు కాలుష్యాన్ని పరిమితం చేయవచ్చని తెలిపింది. దిల్లీ వాయు కాలుష్యంపై(Delhi Air Pollution) దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా.. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం(Supreme Court On Delhi pollution) ఈ మేరకు వ్యాఖ్యానించింది.
అంతకుముందు... దిల్లీలో వాయు కాలుష్యం(Delhi Air Pollution) కట్టడి కోసం పూర్తి స్థాయి లాక్డౌన్ విధించేందుకు తాము సిద్ధమేనని సుప్రీంకోర్టుకు దిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే.. దిల్లీతో పాటు దేశ రాజధాని ప్రాంత(ఎన్సీఆర్) పరిసర రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ విధిస్తే ప్రభావవంతంగా ఉంటుందని చెప్పింది. ఈ మేరకు న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించింది.
కేంద్రం ప్రణాళిక..
పంట వ్యర్థాలు కాల్చడమే.. దిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో కాలుష్యానికి ప్రధాన కారణం కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. పంటవ్యర్థాలు కాల్చడం వల్ల 10శాతం మాత్రమే కాలుష్యం ఏర్పడుతోందని పేర్కొంది. సరి-బేసీ విధానంలో వాహనాలను అనుమతించడం, ట్రక్కులను నిషేధించడం, కఠినంగా లాక్డౌన్ విధించడం వంటి మూడు దశల ద్వారా దిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు పరిశీలించింది. రైతులు పంట వ్యర్థాలు కాల్చడమే వాయు కాలుష్యానికి(Delhi Air Pollution) కారణమని దిల్లీ ప్రభుత్వం పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ తరహా కుంటిసాకులు అర్థం లేనివని చురకలు అంటించింది. దిల్లీలో ఏయే పరిశ్రమలను ఆపవచ్చు? ఏ వాహనాలను నిషేధించవచ్చు? ఏయే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆపవచ్చు? వంటి వాటిపై మంగళవారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తాము ఆదేశాలివ్వడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది.
రేపు అత్యవసర భేటీ నిర్వహించండి..
వాయు కాలుష్యం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రేపు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ భేటీకీ హాజరు కావాలని చెప్పింది. తదుపరి విచారణను నవంబరు 17కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: Delhi Pollution: 'తీవ్ర స్థాయికి కాలుష్యం.. లాక్డౌన్ విధించొచ్చు కదా!'