సీట్ల పంపకంలో ఆలస్యం జరగడం వల్లే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి ఓటమి పాలైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ అన్నారు. దీనినుంచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణ పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రదర్శన చాలా పేలవంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఫలితాలపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉందని, దీనిపై ఆత్మపరిశీలన, సమగ్ర విశ్లేషణ అవసరమని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
''ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్నదాని కంటే తక్కువ సీట్లు వచ్చాయి. 70 స్థానాల్లో కనీసం 50 శాతం సీట్లు వస్తాయని అంచనా వేశాం. మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యత కూడా ఉంది. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. సీట్ల పంపకం కూడా మహా కూటమి ఓటమికి ఓ కారణం. జులై నాటికే సీట్ల పంపకం పూర్తి చేయాలని ఓ దశలో రాహుల్ గాంధీ చెప్పారు.. కానీ, ఎన్నికలు దగ్గరపడ్డాక సీట్లు ఖరారు చేయడం ఓటమికి కారణమైంది.''
- తారిఖ్ అన్వర్, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇదీ చూడండి: బిహార్ విజయోత్సాహం- భాజపా తర్వాతి టార్గెట్ బంగాల్!
వచ్చే ఏడాది జరిగే బంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్వర్ చెప్పారు. మహా కూటమి ఓటమి వెనుక ఎంఐఎం పాత్ర కూడా ఉందని చెప్పారు. ఒక పార్టీని ఎన్నికల్లో పోటీ చేయొద్దని తాము అనబోమన్నారు. సీమాంచల్‌లో ఆ పార్టీ 5 సీట్లే గెలిచినప్పటికీ 15 సీట్లలో మహా కూటమి ఓట్లను చీల్చిందని అభిప్రాయపడ్డారు. పరోక్షంగా అది భాజపాకు కలిసొచ్చిందని చెప్పారు.