గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట వద్ద ఆందోళనకారులతో కనిపించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వల్ల అక్కడి నుంచి బైక్‌పై వెళ్లిపోయినట్లు ఒక వీడియో ఫుటేజ్ వైరల్ అయింది.
ట్రాక్టర్ల ర్యాలీపై మంగళవారం తన ఫేస్‌బుక్ పేజీలో లైవ్ స్ట్రీమ్ చేసిన సిద్ధూ.. ఆందోళనకారులు ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేయడాన్ని సమర్థించారు. అయితే, తాము జాతీయ పతాకాన్ని తొలగించలేదని, ఉద్యమానికి గుర్తుగా కేవలం సిక్కు మత చిహ్నమైన 'నిశాన్ షాహిబ్' జెండాను పెట్టినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఎర్రకోట నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైన సిద్ధూ.. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయారు.
కేసులో సిద్ధూ పేరు కూడా..
మరోవైపు గణతంత్ర దినోత్సవం నాడు హస్తినాలో చోటుచేసుకున్న ఘటనలపై దిల్లీ పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో సిద్ధూ పేరు కూడా ఉంది. ఘటనపై అతడికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : దిల్లీ హింస: 550 ట్విట్టర్ ఖాతాలపై వేటు